టీడీపీ ఫస్ట్ లిస్ట్: మంత్రులకు టిక్కెట్లు కష్టమే...?

Update: 2018-12-25 00:30 GMT

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం ఉన్నప్పటికీ పార్టీ నేతల పై ప్రజలకు విశ్వాసం లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గ్రహించారు. కేవలం సర్వేలు మాత్రమే కాదు వారి పనితీరును కూడా బేరీజు వేసుకున్న అధినేత వీరిని ఇలాగా కొనసాగించితే పార్టీ మనుగడ కష్టమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సిట్టింగ్ లలో చాలా మంది చీటీ చింపేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎన్నిసార్లు వార్నింగ్ లు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఇక వారిని పక్కన పెట్టేయాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారన్నది అమరావతి లో టాక్.

ఆగ్రహం వెనక కారణం....?

ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలోనూ బాబు గొంతులో అదే విషయం ధ్వనించింది. ఆరు నెలలు కష్టపడితేనే గట్టెక్కుతామని, ఇక ఎవరికీ విశ్రాంతి ఉండదని, ఎవరికీ మినహాయింపు ఉండదని చంద్రబాబు గట్టిగా చెప్పారంటే దాని వెనక నివేదికల సారాంశమేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు కొందరు కనీసం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పట్టించుకోవడం లేదని, అందుకే చంద్రబాబు అలా సీరియస్ అయ్యారని అంటున్నారు. లోకేష్ టీం నియోజకవర్గాల వారీగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ఇచ్చిన నివేదికనుచూసే చంద్రబాబు అలా ఫైరయ్యారట.

పార్టీని పట్టించుకోకుండా....?

ఉదాహరణకు చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య సభ్యత్వ నమోదులో చివరి స్థానంలో ఉండటంతో ముఖ్యమంత్రి అవ్వడంతో ‘‘ సార్ త్వరగా ఫినిష్ చేస్తాను’’ అనడంతో ఏంటి ఫినిష్ చేసేది పార్టీనా? అని చంద్రబాబు మండపడింది అందుకేనంటున్నారు. సభ్యత్వ నమోదును పట్టించుకోకుండా, ప్రజల్లో తిరగకుండా, కేవలం ప్రయివేటు కార్యక్రమాలతోపాటు సొంత వ్యాపారాలపైనే ఎక్కువ దృష్టి పెట్టిన 30 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే తన వద్దకు రప్పించుకుని క్లాస్ పీకే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలి వల్లనే పార్టీకి ఏపీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.

జనవరిలో ఫస్ట్ లిస్ట్...?

అందుకోసమే జనవరిలో ప్రకటించే తొలి జాబితాలో కొందరు ముఖ్య నేతల పేర్లు కూడా ఉండవన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తుంది. తొలిజాబితాలో కొందరు అమాత్యుల పేర్లు కూడా ఉండవని టీడీపీ వర్గాల పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. ఇందులో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇద్దరు, కోస్తా ప్రాంతానికిచెందిన ఇద్దరు మంత్రులు,రాయలసీమకు చెందిన ఒక మంత్రి ఉన్నట్లు అమరావతిలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జనవరి నెల అంటేనే మంత్రులకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దడ పుడుతోంది. పార్టీని గాడిన పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో విజయం కష్టమేనని ఆయన నిర్ణయానికి వచ్చే ఘాటు వ్యాఖ్యలకు, చర్యలకు దిగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Similar News