టీడీపీ ఎమ్మెల్యేను ఓడించేదెవరో తెలుసా...??

Update: 2018-12-22 03:30 GMT

ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ప్రతిపక్షంతో కంటే సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువైపోయారు. కాస్త ఏమరుపాటుగా ఉంటే చాలు కిందకు లాగి పారేయాలని చూస్తున్నారు. తమ పార్టీ నాయకుడే అన్న ధ్యాసే లేకుండా కుర్చీ దింపేయాలని పట్టుదలకు పోతున్నారు. ఇదంతా టీడీపీకి కంచుకోట లాంటి విశాఖ జిల్లాలోనే జరుగుతోంది. మరి ఎమ్మెల్యే వ్యతిరేకులకు అంత ధైర్యం ఎలా వచ్చింది. వారిని ఎగదోస్తోంది ఎవరు అన్నది ఇక్కడ ఆసక్తిని గొలిపే అంశమే. ఆ ఎమ్మెల్యే వద్దనుకుంటేనే కద ఇలా పొగ పెట్టేది. సెగ పెట్టే వారిని అండదండలు అందించేది. మరి ఆ కధేంటి. తెర వెనక సన్నివేశాలేంటి. ఇదే ఇపుడు ఎమ్మెల్యే అనుచర వర్గంలో మదన పెడుతోంది.

గాజువాక ఎమ్మెల్యేపై అసమ్మతి.....

ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. తండ్రి సైతం టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నేత. ఇక రాజకీయాల్లోకి వస్తూనే విశాఖ లోక్ సభ లాంటి ప్రతిష్టాత్మ‌మైన సీటులో అప్పటి కేంద్ర మంత్రి, కాంగ్రెస్ అభ్యర్ధిని దగ్గుబాటి పురందేశ్వరిని ఢీ కొట్టి పోటా పోటీగా రెండవ స్థానం తెచ్చుకున్న నాయకుడు. అతనే గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ప్రజారాజ్యం తరఫున రాజకీయ అరంగేట్రం చేసి విశాఖ ఎంపీగా పోటీ చేసి సత్తా చాటుకున్న పల్లా శ్రీనివాసరావు 2014లో టీడీపీలో చేరి అనూహ్యంగా గాజువాక టికెట్ సాధించారు. ఆ మీదట టీడీపీ ఊపులో ఎమ్మెల్యే అయిపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడిగా ఉంటూ జిల్లాలో కీలక ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్న పల్లా ఇటీవల కాలంలో వివాదాలో చిక్కుకున్నారు. అదే అదనుగా పార్టీలోని ప్రత్యర్ధులు ఆయనపైన బాణాలు ఎక్కుపెడుతున్నారు. భూ కబ్జాలు, అవినీతి ఆరోపణల్లో పల్లా బంధువులు ఉండడంతో ఎమ్మెల్యే ఆత్మ రక్షణలో పడ్డారు

మాజీ కార్పోరేటర్ సారధ్యం....

పల్లా వ్యతిరేక శిబిరానికి మాజీ కార్పోరేటర్ లేళ్ళ కోటేశ్వరరావు నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆయన నిర్వహించిన సభకు టీడీపీలోని మెజారిటీ క్యాడర్ హాజరు కావడంతో ఎమ్మెల్యే వర్గీయులు బేజారవుతున్నారు. ఇదే ఊపు కొనసాగితే పట్టు చేజారుతుందన్న కంగారు వారిలో మొదలైంది. ఎమ్మెల్యేపై చాలాకాలంగా ఉన్న అసంతృప్తిని మాజీ కార్పోరేటర్ తెలివిగా ఒడిసిపట్టి అందరినీ ఒక్క చోట చేర్చడంతో పల్లా గ్యాంగ్ ఇరకాటంలో పడింది. టీడీపీ ఎమ్మెల్యెగా నెగ్గినా కూడా పల్లాలో పాత వాసనలు పోలేదని, ఆయన చుట్టి వచ్చిన ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకే పెద్ద పీట వేస్తూ అసలైన టీడీపీ తమ్ముళ్ళకు అన్యాయం చేస్తున్నాడన్నది క్యాడర్లో గూడు కట్టుకున్న ఆవేదన.

గంటాకు వ్యతిరేకంగా....

ఇక తన బంధువులు, ఆశ్రితులకు తప్ప ఎమ్మెల్యే ఎవరికీ పలకడన్నది మరో అభియోగం. దీంతో ఎన్నికల వేళ సెగ మొదలైంది. ఈ నేపధ్యంలో అంతకంతకూ మాజీ కార్పోరేటర్ వర్గం బలోపెతం కావడం క్యాడర్ మొత్తం ఆ వైపుగా సాగిపోవడంతో పల్లా శిబిరంలో ఆందోళన మొదలైంది. ఈ దఫా టికెట్ వస్తుందా లేక మాజీ కార్పోరేటర్ ఎగరేసుకుపోతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికైతే ఎమ్మెల్యే శిబిరం దిగివచ్చి బుజ్జగింపుల పర్వానికి తెర తీసినా నాలుగున్నరేళ్ళుగా తమను పట్టించుకోలేదన్న ఆగ్రహంతో ఉన్న క్యాడర్ చల్లబడడం లేదు. మరి పల్లాకు ఈ రకమైన వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నదెవరన్నది కూడా అంతుచిక్కడంలేదు. ఈ మధ్యనే మంత్రి గంటాకు వ్యతిరేకంగా లేఖాస్త్రాలు సీఎం కి సంధించిన ఫలితామా ఇది అని కూడా ఆలోచనలు చేస్తున్నారుట.

Similar News