తెలంగాణ ఎఫెక్ట్...తమ్ముళ్లలో జోష్... !!

Update: 2018-12-14 11:00 GMT

తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ నేతల్లో తీవ్ర నిరాశ కలుగచేశాయి. అక్కడ కాంగ్రెస్, టీడీపీ కలసి కట్టిన మహా కూటమి విజయం సాధిస్తే ఇక్కడ ఏపీలోనూ పొత్తు కుదురుతుందని, దాతో తాము కూడా గట్టెక్కగలమని ఇన్నాళ్ళూ భావిస్తూ వచ్చారు ఇపుడు అక్కడ ఫలితాలు తారు మారు కావడంతో ఏపీలో పొత్తులు ఉంటాయా అన్న సందేహంలో కూడా నేతలు పడుతున్నారు. నిజానికి ఈ మూడు జిల్లాల్లో కలుపుకుని అర డజను సీట్లు పొత్తులో భాగంగా పొందాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. మరోవైపు పొత్తు ఉండకపోతే తమ సీట్లు తమకు దక్కుతాయని టీడీపీ నేతలు హుషారుగా కన్పిస్తున్నారు.

చేరికలు ఉంటాయా...?

పొత్తులు ఉండవని తెలిస్తే కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మంత్రి గంటా సన్నిహిత చుట్టం పరుచూరి భాస్కర రావు అనకాపల్లి నుంచి పోటీ కోసం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. అందుకు గాను ఆయన ఈ నెల 20వ తేదీ ముహూర్తంగా పెట్టుకున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉంటేనే ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సిధ్ధపడతారన్న మాట వినిపిస్తోంది. పొత్తులు లేని కాంగ్రెస్ లో ఉండడం వృధా అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక విజయనగరం, శ్రికాకుళం జిల్లాల నుంచి కూడా కొంతమని చేరికలకు ప్ర‌యత్నాలు చేసుకుంటున్నారు. అలాగే, కాంగ్రెస్ వీడి వెళ్ళిన వారు కూడా వద్దామని కూడా భావిస్తున్నారు. అందరి ఆలొచనలూ తెలంగాణా ఎన్నికల ఫలితాల మీదనే ఉన్నాయి. తీరా ఫలితాలు రివర్స్ లో రావడంతో ఇపుడు నేతలంతా ఆలొచనలో పడ్డారు. అంతే కాదు, కాంగ్రెస్ లో ఉన్న వారు కూడా ఇకపై పక్క చూపులు చూస్తారని అంటున్నారు.

తమ్ముళ్ళలో జోష్....

తెలంగాణాలో కూటమి ఓటమి పాలు అయినా కాంగ్రెస్ తో పొత్తుకు జనం విముఖంగా ఉన్నారన్న సంకేతాలు ఆ తీర్పులో ఉన్నాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. అందువల్ల ఏపీలో కూడా పొత్తులు ఉండవకపోవచ్చునని వారు ఊహిస్తున్నారు. అదే కనుక జరిగితే తమ సీట్లకు డౌట్ ఉండదని కూడా భావిస్తున్నారు. పొత్తుల పేరిట ఏపీలో ప్రయోగం చేస్తే తెలంగాణాలో మాదిరిగా తాము కూడా నష్టపోతామని కూడా అంటున్నారు. మొత్తానికి తెలంగాణా ఫలితాలతో టీడీపీలోని ఆశావహులు నిబ్బరంగా కనిపిస్తూంటే కాంగ్రెస్ లోని ఆశవహులు మాత్రం టెన్షన్లో ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Similar News