తెలంగాణ ఎఫెక్ట్‌.. ఏపీలో పార్టీల పాట్లు..!

Update: 2018-12-11 02:30 GMT

ఏపీపై తెలంగాణా ఎన్నిక‌ల ఎఫెక్ట్ ప‌డిందా? గ‌త‌ ఎన్నికల్లో లేని విధంగా ఈసారి ముందస్తు ప్రచారానికి పార్టీలు దిగాయా? ఎడతెరిపి లేకుండా పార్టీ అధిష్టానం ఇస్తున్న పిలుపుతో నేరుగా ఓటర్లను కలవడానికి అన్ని పార్టీల నేతలు తలమునకలై ఉన్నారా? ప్రజా సమస్యల్లో కీలకమైన వాటిని గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారా? అంటే .. తాజాగా ఏపీలో ప‌రిణామాలు ఇలానే మారాయ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు ప్రజ‌ల‌కు ప‌నులు చేసి పెట్టేందుకు నాయ‌కులు ముందుకు వ‌స్తున్నారు. పని పూర్తయితే అటు లబ్ధిదారుడు, ఇటు పార్టీ నేతలు మురిసిపోతున్నారు. పనిలో పనిగా రాబోయే ఎన్నికల్లో మీ మద్దతు పార్టీకేనంటూ అసలు విషయాన్ని చల్లగా చెప్పి జారుకుంటున్నారు.

సామాజిక వర్గాల అంచనాతో....

మరికొందరు నాయ‌కులు సామాజిక వర్గాలను అంచనా వేస్తున్నారు. మొత్తం ఓటర్లలో ఏ సామాజిక వర్గం పెత్తనం వహిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే మించి గ్రామ స్థాయిలోనే ఇప్పటినుంచే ఎన్నికల పని చక్కపెడుతు న్నారు. ప్రధానపార్టీలు తెలుగుదేశం, వైసీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలతో సహా వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు ఇప్పటికే రోడ్డెక్కారు. ప్రత్యక్షంగా ఓట్ల కోసం అభ్యర్థించకపోయినా ఏదైనా మీవెంటే మేముం టాం.. అని సంకేతాన్ని నేరుగానే పంపుతున్నారు. అధికార తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే తగిన కసరత్తును ఆరంభించింది.

వైసీపీ గడప...గడపకూ....

ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలుపేరిట నేరుగా గ్రామదర్శిని కార్యక్రమాన్ని నెలన్నర క్రితమే ఆరంభించారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీ, ఎంపీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లతో పాటు మిగతా కేడర్‌ అంతా గ్రామస్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వ పథకాలను వివరించడం, వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం, తద్వారా ప్రజలకు మరింత చేరుకావడమే లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతుందా.. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. పల్లె ప్రజల్లో పార్టీకి మరింత పునాది చేకూరేలా వైసీపీ గడపగడపకు పేరిట కార్యక్రమం చేపట్టింది.

టీడీపీని ఎండగడుతూ......

ఈ మధ్యనే ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ దీనినిమార్చి ‘కావాలి జగన్‌..రావాలి జగన్‌’ పేరిట నియోజకవర్గాల్లో కలియ తిరుగుతున్నారు. నేరుగా సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను వివరిస్తున్నారు. అధికార టీడీపీ వైఖరిని విమర్శిస్తూ.. కొన్నిచోట్ల ఆరోపణలు గుప్పిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక‌, జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. ఇప్పటికీ నియోజకవర్గ స్ధాయిలో నిర్మాణాత్మక పాత్ర పోషించలేని జనసేన.. సరికొత్త వ్యూహాన్ని రచించింది. జనసేన తరంగం పేరిట సరికొత్త కార్యక్రమం రూపొందించి ఇటీవల ఆరంభించింది. ఫేస్‌బుక్‌ లైవ్‌ను ఈ కార్యక్రమంలోనే ఓటర్లకు పరిచయం చేస్తున్నారు. మ‌రి ఈ పార్టీల వ్య‌వ‌హారం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

Similar News