కొంచెం వెతికిపెట్టరూ..?

గతంలో ఓటమి చెందినా పార్టీనే అంటిపెట్టుకుని ఉండేవారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం పాకులాడే నేతలుండేవారు. కానీ నేటి రోజులు వేరు. అధికారం చేజారిపోతే.. ఆ పార్టీలో [more]

Update: 2019-07-03 03:30 GMT

గతంలో ఓటమి చెందినా పార్టీనే అంటిపెట్టుకుని ఉండేవారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాల కోసం పాకులాడే నేతలుండేవారు. కానీ నేటి రోజులు వేరు. అధికారం చేజారిపోతే.. ఆ పార్టీలో క్షణం కూడా ఉండేదుకు ఏ నేతా ఇష్టపడటం లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటి వరకూ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించకపోవడంతో ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కన్పిస్తోంది. చంద్రబాబునాయుడు ఇప్పుడు గట్టి నేతల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.

ఓటమి పాలు కావడంతో….

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకుంటే… అక్కడ పార్టీని నడిపే నేత కరవయ్యారు. తెలుగుదేశం పార్టీకి గోనుగుంట్ల సూర్యనారాయణరెడ్డి అలియాస్ వరదాపురం సూరి నమ్మకమైన నేత. 2014 ఎన్నికల్లో గెలిచిన వరదాపురం సూరిని పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా చంద్రబాబునాయుడు నియమించారు. అయినా పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా విఫలమవ్వడంతో వరదాపురం సూరి సైకిల్ పార్టీని వీడారు. ఆయన కొద్దిరోజుల క్రితం కమలం గూటికి చేరిపోయారు.

అక్కడ ఏముందని…?

నిజానికి వరదాపురం సూరి కమలం గూటికి చేరాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ప్రభావమూ అంతంత మాత్రమే. దానిక ఓటు బ్యాంకు అసలే లేకున్నా వరదాపురం సూరి పార్టీని వీడటం చంద్రబాబునాయుడుకు కూడా షాక్ ఇచ్చినట్లయింది. అయితే తనపై అక్రమ కేసులు బనాయించకుండా ముందు జాగ్రత్త చర్యగా వరదాపురం సూరి కమలం గూటికి చేరినట్లు నియోజకవర్గంలో విన్పిస్తున్న టాక్.

ప్రత్యామ్నాయం కోసం…..

వరదాపురం సూరి పార్టీని వీడటంతో అక్కడ బలమైన నేతకోసం చంద్రబాబునాయుడు అన్వేషిస్తున్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ నేతలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కార్యకర్తలు అధైర్యపడకుండా సరైన నాయకత్వం కావాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. ధర్మవరం లో ద్వితీయ శ్రేణి నేతల్లో బలమైన నేతను చూడాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరినట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఓటమిపాలయిన నేపథ్యంలో పార్టీ పగ్గాలను నియోజకవర్గంలో చేపట్టేందుకు ఎవరు ముందుకు వస్తారా? అన్నది అనుమానంగానే ఉంది.

Tags:    

Similar News