ఈసారైనా గెలవండి ప్లీజ్....!!!

Update: 2018-12-07 01:30 GMT

తమ్మినేని సీతారాం...ఒకప్పుడు తెలుగుదేశంపార్టీ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లోనూ పనిచేశారాయన. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లిచేతులు కాల్చుకున్నారు.అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరారు. తమ్మినేని సీతారాం జిల్లాలోనే కీలక నేతగా ఎదిగారు. సుదీర్ఘ అనుభవం ఉన్న తమ్మినేని సీతారాం గత ఎన్నికల్లో మేనల్గుడి చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఈసారి ఎలగైనా గెలుస్తామన్న ధీమాలో తమ్మినేని ఉన్నారు. తన సొంత బలంతో పాటు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర కూడా నియోజకవర్గంలోకి ప్రవేశించడంతో ఆయన తనదే గెలుపు అన్న ధీమాతో ఉన్నారు. తమ్మినేని ప్రత్యర్థిగా ఇక్కడ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఉన్నారు.

బావాబామ్మర్దుల మధ్య....

కూన రవికుమార్ ఎవరో కాదు. తమ్మినేని సీతారాం భార్యకు స్వయానా తమ్ముడే. ఒకరకంగా మేనమామ మేనల్లుళ్లు...మరోరకంగా బావా, బామ్మర్దులు. గత ఎన్నికల్లో తమ్మినేని సీతారాం తన బావమరిది కూన రవికుమార్ పై 4918 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీ జెండా వదలకుండా పట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ విధానాలపై తమ్మినేని సీతారాం చేసిన పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేకత కలసి వస్తాయంటున్నారు. సీతారాంకు ఆముదాల వలస నియోజక వర్గంలో గట్టిపట్టుంది. వైసీపీకి బలమైన క్యాడర్ కూడా ఉంది.

నాలుగు సార్లు గెలిచి....

తమ్మినేని సీతారాం ఆముదాలవలస నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. 1983లో స్వతంత్ర అభ్యర్థిగా, 1985, 1994, 1999 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా వీయడంతో ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధి బొడ్డేపల్లి సత్యవతి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన తమ్మినేని గెలుపొందకపోయినా కాంగ్రెస్ ను వెనక్కు నెట్టేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. తిరిగి 2014లో వైసీపీనుంచి పోటీ చేసిన ఆయన తన బామ్మర్ది చేతిలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

ఇరవై ఏళ్లుగా విజయం లేక....

అంటే రెండు దశాబ్దాలుగా ఆయన విజయాన్ని రుచిచూడాలేదు. 1999లో గెలిచిన తమ్మినేని సీతారాం 2019 ఎన్నికల్లో గెలిచేందుకు విపరీతంగా శ్రమిస్తున్నారు. ఇరవై ఏళ్లుగా ఓటమిపాలవుతున్నా జనం మధ్యనే ఉండటం తమ్మినేని ప్రత్యేకత.అదే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇప్పుడు జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర ఆముదాలవలస నియోజకవర్గంలోకి ప్రవేశించడం, జగన్ కు అపూర్వ స్వాగతం లభించడంతో తమ్మినేని ఫుల్లు జోష్ లో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా తనదే గెలుపుఅన్న విశ్వాసాన్ని తమ్మినేని వ్యక్తం చేస్తున్నారు. తమ్మినేని రాజకీయంగా నిలదొక్కు కోవాలంటే ఇదే చివరి అవకాశమేమో...!!!

Similar News