జాతకం మారుతుందటగా.... !!

Update: 2018-12-09 14:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాళింగ సామజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం రాజకీయ సిరి ఎలా ఉంటుందన్న దానిపైన చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆయన మరో మారు తన జాతకాన్ని చూసుకోవాలని ఆరాటపడుతున్నారు. చూస్తుంటే పరిస్థితులు మాత్రం ఆయనకు అంతగా అనుకూలించడంలేదు. మరి జగన్ బలంలో ఈసారి జెండా ఎగరేయాలనుకుంటున్నా అధినేత ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

గెలిచి రెండు దశాబ్దాలు....

తమ్మినేని సీతారాం గెలుపు రుచి చూసి అపుడే రెండు దశాబ్దాలు గడచిపోతోంది. ఆయన చివరిసారిగా ఆముదాలవసలో గెలిచింది 1999 ఎన్నికల్లోనే. ఆ తరువాత ఆయన ఇప్పటికి మూడు విడతలుగా ఓడిపోయి హ్యాట్రిక్ కొట్టేశారు. రెండు సార్లు కాంగ్రెస్ చేతిలో ఓడిపోగా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి మరీ ఓటమిని చవి చూశారు. టీడీపీలో తన శిష్యుడైన కూన రవికుమార్ చేతిలో తమ్మినేని పరాజయం పాలు అయ్యారు. అయితే కేవలం ఆరు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోవడంతో తమ్మినేనిలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి.

వర్గ పోరు....

ఇదిలా ఉండగా తమ్మినేనికి వైసీపీలో వర్గ పోరు ఎక్కువగా ఉంది. ఆయన కుమారుడు నాగ్ ని ఎక్కువగా ప్రోత్సహించడంతో మిగిలిన నాయకులు దూరం జరుగుతున్నారు. మరో వైపు దురుసు ప్రవర్తన కూడా అయన్ని నాయకులకు దూరంగా పెట్టింది. ఇక ఓ దఫా ఓడిపోయిన తమ్మినేని పైన ఇతర నాయకులు కూడా పెద్దగా విశ్వాసం చూపడంలేదని అంటున్నారు. ఆయన కనుక మళ్ళీ పోటీ చేస్తే గెలుపు సందేహమేనని నివేదికలు కూడా జగన్ కి వెళ్తున్నాయి. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు తాము కూడా పోటీకి రెడీ అంటున్నారు. దీంతో తమ్మినేని పరిస్థితి ఇరకాటంలో పడింది.

జగన్ ఏం చేస్తారో...?

ఈ సీనియర్ నేత, మాజీ మంత్రి విషయంలో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. 1983లో అన్న నందమూరి పార్టీ పెడితే యువకునిగా చేరి వెంటనే ఎమ్మెల్యే అయిన తమ్మినేని అదే ఊపులో 1985 లో కూడా గెలిచేశారు. 1989లో ఓడినా ఆయన 1994, 1999లో వరసగా రెండు మార్లు గెలిచి బాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తమ్మినేని ఆ తరువాత మాత్రం గెలవలేదు. ఆయన మధ్యలో ప్రజారాజ్యం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారు. మొత్తానికి జగన్ తన‌కున్న సర్వేలు, నివేదికల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్ధిని నిలబెడతారని అంటున్నారు.

Similar News