వార్ వన్ సైడ్ కాదు... కాని...??

Update: 2018-12-04 17:30 GMT

తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం టిడిపి కాంగ్రెస్ జట్టు తో మారిపోయింది. బాబు ఎన్నికల ప్రచారం కి వచ్చాక మరింత తేడా వచ్చింది. కూటమి నేతల మధ్య సమన్వయం తీసుకురావడం నేరుగా రాహుల్ తో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం తో గులాబీ పార్టీ ఊహించిన కలహాలు లేకుండా సమసి పోయి అధికార పార్టీని నిరాశలో పడేశాయి. టికెట్ల ప్రకటన వరకు సైలెంట్ గా వున్న బాబు ప్రచారం స్థాయికి ఎన్నికలు చేరుకున్నాకా తనదైన పాత్ర మొదలు పెట్టారు. అదే కెసిఆర్ అండ్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కేక్ వాక్ లా విజయం అందుకుంటామని కలలు కన్న గులాబీ పార్టీ రెండోసారి అధికారం దక్కించుకోవడానికి అనేక ఎత్తులు పైఎత్తులు వేయాలిసి వస్తుంది. అంతే కాదు ప్రతి సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టి వర్క్ అవుట్ కి ట్రై చేస్తుంది.

ప్రతికూలతను అనుకూలతగా ...

ప్రతికూల అంశాలను తమకు అనుకూలంగా మలుచుకోగల సత్తా వున్న ఇద్దరు చంద్రులలో కెసిఆర్ తన గురువు చంద్రబాబుకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. దాంతో ఆయన తెలంగాణ ఎన్నికల్లో టిడిపి నామమాత్రంగా పోటీ చేస్తున్నా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చూస్తున్నారు. దానికి తోడు ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేక భావన లేకపోవడాన్ని గమనించి చంద్రబాబు పై తెలంగాణ వాసుల్లో ద్వేషం ఏ మాత్రం తగ్గకుండా పాత సెంటిమెంట్ కు పదును పెడుతూ వస్తున్నారు. దాంతో అనేక అంశాల్లో కాంగ్రెస్ కి బాబు తో పొత్తు మైనస్ లోకి పడేస్తుంది. ఓట్ల చీలిక కాకుండా కాంగ్రెస్ తమ చిరకాల శత్రువుతో చేతులు కలిపింది. అయితే హస్తం సైకిల్ ఎక్కడం ఆ పార్టీకి లాభం తెస్తుందా నష్టం మిగులుస్తుందా అన్న చర్చ ఇప్పుడు విస్తృతంగా నడుస్తుంది.

సెంటిమెంట్ కు ఓట్లు రాలతాయా ... ?

కాంగ్రెస్ ఎవరితో పొత్తు లేకపోతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా హస్తం పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు తెలంగాణ వాసులు సిద్ధం అయ్యారని ఎప్పుడైతే చంద్రబాబు తో కాంగ్రెస్ కలిసిందో గులాబీ పార్టీ దీన్ని అడ్వాంటేజ్ గా మలుచుకుని ఆంధ్రా నేతకు తెలంగాణ పగ్గాలు అప్పగిస్తారా అంటూ మొదలు పెట్టి బాబు తెలంగాణ ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా రాసిన లేఖలు బయట పెట్టడంతో పాటు, ఓటుకు నోటు కేసు నుంచి అనేక అంశాలను టిడిపి కి ఆపాదించి గేమ్ ఛేంజ్ చేసింది. దాంతో పోటీ టీఆర్ఎస్ వెర్సెస్ టిడిపి గా సీన్ మార్చారు కెసిఆర్. తమ ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకోవడంతో పాటు చంద్రబాబు అండ్ కూటమి తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరిస్తూ పక్కా వ్యూహంతో దూసుకుపోతుంది గులాబీ పార్టీ. సమైక్యవాదులందరు తెలంగాణ పై దాడికి మూకుమ్ముడిగా దిగారంటూ జనంలో సెంటిమెంట్ బలంగా పంపేసింది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ ను కలవరపరుస్తోంది.

అక్కడ లాభామే ...

తెలుగుదేశం పార్టీతో పొత్తు కాంగ్రెస్ కి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ కి ప్లస్ అయితే అవుట్ ఆఫ్ హైదరాబాద్ టీఆర్ఎస్ హవా టి సెంటిమెంట్ నడుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్ విరుగుడుకి ఇప్పటికిప్పుడు విపక్ష కూటమి దగ్గర మందు లేదు. దాంతో గంప లాభం చిల్లు తీస్తున్నట్లుగా కూటమి పరిస్థితి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి టిడిపి ప్లస్ అవుతుందా ? మైనస్ అవుతుందా అన్నది ప్రతి చోటా చర్చనీయాంశంగా తయారు కావడం విశేషం.

Similar News