స్వామీజీ ఆశీస్సులుంటే చాలుకదా... !!

Update: 2018-12-26 13:30 GMT

విశాఖ నగర శివారులో ఉన్న పెందుర్తి శారదాపీఠం అధిపతి శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి రాజకీయ నాయకులకు దేవుడైపోయారు. ఏకంగా తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన దైవం. స్వామీజీ మాట జవదాటరు. యాగాలు, హోమాలు ఇలా ఏం జరిగినా కూడా స్వామిజీనే చేయాలి. తాజాగా విశాఖకు వచ్చిన కేసీయార్ స్వామీజీ ఆశ్రమంలో రెండున్నర గంటల సేపు గడిపారు. ప్రత్యేక పూజలు చేశారు. స్వామీజీకి సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఆయన ఆశీస్సులు అందుకున్నారు. కొంతసేపు ఏకాంతంగా స్వామీజీతో సంభాషించిన కేసీయార్ దేశంలో కొత్త రాజకీయాల కోసం ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్ విజయవంతం కావాలని స్వామీజీ దీవెనలు తీసుకున్నారు. . దీనికి సంబంధించి హోమాలు చేయాలని కూడా నిర్ణయించారు.

అందరికీ సన్నిహితులు...

పెందుర్తి స్వామీజీ అందరికీ సన్నిహితులుగా పేరుగాంచారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాల క్రితం పెందుర్తిలో ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. అప్పట్లో విశాఖకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు ద్రోణం రాజు సత్యనారాయణ పీఠానికి తరచూ వచ్చేవారు. ఆయనతో పాటు టీ సుబ్బరామిరెడ్డి తదితరులు కూడా స్వామీజీ అనుగ్రహం కోసం వస్తూండేవారు. ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వంటి వారు కూడా పీఠానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒడిషాకి చెందిన మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో వంటి వారితో పాటు బీజేపీకి చెందిన ప్రముఖులు అనేకమంది స్వామీజీతో ఆధ్యాత్మిక సమాలోచనలు చేస్తూంటారు.

జగన్ సైతం...

వైసీపీ అధినేత జగన్ స్వామీజీని అనేకమార్లు కలుసుకుని పీఠంలో పూజలు నిర్వహించారు. జగన్ విశాఖ టూర్ ఉంటే తప్పనిసరిగా ఆశ్రమానికి వెళ్తారు. తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మంత్రులు, ఎంపీలు అనేకమంది స్వామీజీ ఆశ్రమానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక సినిమా నటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా స్వామీజీని కలిసేందుకు ఆరాటపడతారు. మొత్తం మీద చూసుకుంటే స్వామీజీకి రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాలు వేరే ఎవరికీ లేవని చెప్పుకోవాలి. ఆ విధంగా ఆయన రాజకీయ నాయకులకు దేవుడుగా మారిపోయారు.

బాబుపై వ్యాఖ్యలతో......

ఇకపోతే స్వామీజీ సైతం రాజకీయ విమర్శలు చేస్తూ అనేక మార్లు సంచలనం రేపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరవు తప్ప వానలు కురియవని ఓ సందర్భంలో స్వామీజీ చేసిన వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఇక బాబు ప్రమాణం చేసిన ముహూర్తం మంచిది కాదని, అందువల్లనే ఏపీకి అనర్ధాలు వస్తున్నాయని మరో సందర్భంలో స్వామీజీ చేసిన వ్యాఖ్యలు టీడీపీకి ఆగ్రహం కలిగించాయి. బాబు హయాంలో హిందూ దేవాలయాలకు ప్రాధాన్యత లేకుండా పోతోందని కూడా అప్పట్లో స్వామీజీ కామెంట్స్ చేశారు. మొత్తానికి బాబుతో స్వామీజీకి కొంత ఎడం ఉందని అంటారు. కానీ, అన్ని రాజకీయ పార్టీలకు మాత్రం ఆయన ఇష్టుడిగా మారారు. తెలంగాణా ఫలితాల తరువాత బాబుకు వ్యతిరేక కూటమిలో ఉన్న కేసీయార్ స్వామీజీని కలవడంతో మరో మారు శారదాపీఠం అందరి దష్టిలోకి వెళ్ళిందని చెప్పాలి.

Similar News