గోల్డెన్ డేస్ వస్తున్నాయా..?

Update: 2018-12-24 06:30 GMT

2014 తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అనేక మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ గూటికి చేరారు. అలా వెళ్లిన ముఖ్య నాయకుల్లో కే.ఆర్.సురేష్ రెడ్డి ఒకరు. ఇటీవలి ఎన్నికల ముందు ఆయన ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరిపోయారు. వాస్తవానికి, యువజన కాంగ్రెస్ మండల స్థాయినేతగా కాంగ్రెస్ లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయనకు పార్టీతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అయినా ఆయన పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే, అప్పటికే టీఆర్ఎస్ లో టిక్కెట్ల కేటాయింపు జరిగిపోవడంతో ఈ ఎన్నికల్లో సురేష్ రెడ్డికి ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం లభించలేదు. అయితే, ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని టీఆర్ఎస్ మామీ ఇచ్చింది. కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికెళ్లి చర్చలు జరిపి పార్టీలో చేర్చుకున్నారు. మరి, సురేష్ రెడ్డి కి ఎటువంటి అవకాశం కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మంత్రి పదవి దక్కేనా..?

1989 నుంచి వరుసగా నాలుగుసార్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సురేష్ రెడ్డి... 2004లో కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్పీకర్ గా పనిచేసిన మొదటి వ్యక్తి ఆయన. నాలుగుసార్లు గెలిచినా మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కలేదు. ఇక, 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన ఆర్మూర్ నుంచి పోటీచేసి రెండుసార్లు ఓడిపోయారు. సురేష్ రెడ్డికి రాజకీయవర్గాల్లో మంచి పేరుంది. ఆయన స్పీకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, టీఆర్ఎస్ లో ఆయన పాత్రేమిటి..? ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత..? దక్కుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. రెడ్డి సామాజికవర్గం కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే, రెడ్లకు ఎక్కువగా 5 - 6 మంత్రి పదవులకు మించి ఇవ్వలేరు. వాటికి ఇప్పటికే 10 మందికి పైగా రెడ్డి సామాజకవర్గ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఆశలు పెట్టుకున్నారు. దీంతో మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది. వాస్తవానికి, ఆయనకు హోంమంత్రి పదవి ఇస్తారనే ప్రచారమూ జరిగినా కేసీఆర్... ఆ పదవిని ముందే మహమూద్ అలీకి కట్టబెట్టారు.

మండలి ఛైర్మన్ గా అవకాశం..?

అయితే, స్పీకర్ గా అనుభవం ఉన్న సురేష్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసి స్వామిగౌడ్ పదవీకాలం ముగిశాక శాసనమండలి ఛైర్మన్ ను చేస్తారని తెలుస్తోంది. ఆయనకు శాసనసభను నడిపించిన అనుభవం ఉండటంతో కేసీఆర్ సైతం ఇందుకే మొగ్గు చూపుతున్నారట. అయితే, స్వామిగౌడ్ కూడా మరోసారి తనకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు. ఇక, బీసీ అయిన తన స్థానంలో రెడ్డిని నియమించే అవకాశం ఉందా అనేది అనుమానమే. ఇక, గత శాసనసభలో స్పీకర్ గా పనిచేసిన మధుసుదనాచారి ఈసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆయన కూడా ఎమ్మెల్సీ చేసి మండలి ఛైర్మన్ గా కేసీఆర్ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నారు. ఇక సురేష్ రెడ్డిని రాజ్యసభకు పంపించాలనే ఆలోచన కూడా కేసీఆర్ లో ఉందని అంటున్నారు. దీంతో ఈ పదవికి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. మరి, సురేష్ రెడ్డికి తనకు అందరి ద్రాక్షలా మిగిలిపోయిన మంత్రి పదవి దక్కుతుందా లేదా మళ్లీ చట్టసభను నడిపే అవకాశం లభిస్తుందా లేదా రాజ్యసభలో అడుగుపెడతారో చూడాలి. మొత్తానికి, సురేష్ రెడ్డికి మాత్రం త్వరలో మంచి పదవి దక్కడం మాత్రం ఖాయం అంటున్నారు.

Similar News