అయ్యో... జంప్ చేస్తే ఇదా గిఫ్ట్... !!

Update: 2018-12-27 14:30 GMT

ఎట్టి పరిస్థితుల్లోనూ పాతిక ఎంపీ సీట్లు ఏపీలో సాధించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పట్టుదలగా ఉన్నారు. అందుకోసం ఈసారి గట్టి అభ్యర్ధులను ఎక్కడికక్కడ పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరం ఎంపీ అభర్ధిగా బలమైన నాయకున్ని బరిలో నిలబెట్టాలను కుంటున్నారు. జిల్లాకు చెందిన మంత్రి సుజయ కృష్ణ రంగా రావు పేరు ఇపుడు తెర మీదకు రావడం ఆసక్తికరమైన పరిణామంగా ఉంది.

బొబ్బిలి రాజుగా...

సుజయకృష్ణ రంగా రావు బొబ్బిలి ఎమ్మెల్యెగా గత మూడు పర్యాయాలుగా మంచి ఆధిక్యతతో గెలుస్తూ వస్తున్నారు. రెండు మార్లు కాంగ్రెస్ నుంచి ఒక మారు వైసీపీ నుంచి గెలిచిన రంగా రావు రెండేళ్ళ క్రితం టీడీపీలో చేరి తన చిర కాల కోరిక అయిన మంత్రి పదవిని దక్కించుకున్నారు. జిల్లాలో బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకునిగా ఉన్న రంగారావును వచ్చే ఎన్నికల్లో విజయనగరం ఎంపీ సీటుకు టీడీపీ అధినాయకత్వం చురుకుగా పరిశీలిస్తోంది. ఆయన అయితేనే ఈ సీటుని గెలుచుకుని రాగల సమర్ధుడిగా భావిస్తోంది. ఇక బొబ్బిలి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు బేబీ నాయనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. మొదట బేబీ నాయననే బొబ్బిలి ఎంపీ అభ్యర్ధిగా అనుకున్నారు, కానీ తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని పట్టుపట్టడంతో మంత్రిని కదపాల్సివస్తొందని అంటున్నారు.

రాజు గారికి లైన్ క్లియర్....

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యెగా పోటీ చేద్దామని పూసపాటి అశోక్ గజపతి రాజు అనుకుంటున్నారు. అయితే ఎవరూ సరైన అభ్యర్ధి లేకపోతే ఆయనే ఎంపీ అభ్యర్ధి అని పార్టీ చెబుతూ వస్తోంది. ఇపుడు మంత్రిని బరిలోకి దింపుతున్నారు. దాంతో అశోక్ కి విజయనగరం అసెంబ్లీకి ఎమ్మెల్యెగా అవకాశం ఇస్తారని టాక్ నడుస్తోంది. అదే కనుక జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతని చెక్ చెబుతారని అంటున్నారు. మొత్తానికి బేబీ నాయన వ్యవహారం వల్ల పరిస్థితి మొత్తం మారిపోయిందని అంటున్నారు.

Similar News