మావయ్యా....ముంచావయ్యా....??

Update: 2018-12-12 13:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు భయపడినంతా అయింది. తెలుగుదేశం పార్టీ కి కంచుకోటలా భావించిన కూకట్ పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పరమయింది. చంద్రబాబు కు ఇది కోలుకోలేని దెబ్బే. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కుటుంబం నుంచి తెలంగాణలో పోటీకి దింపినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుమార్తె, చంద్రబాబు మేనకోడలు సుహాసిని ఓటమి పాలు కావడం నందమూరి కుటుంబానికే మచ్చ తెచ్చేలా ఉంది. ఇంట్లో ఉన్న మనిషిని చంద్రబాబు అనవసరంగా రాజకీయాల్లోకి తెచ్చారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. తొలినుంచి సుహాసిని గెలుపు మీద సందేహాలు వ్యక్తం అవుతూనే వస్తున్నాయి.

అనూహ్యంగా తెరపైకి తెచ్చి....

కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తొలుత టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పోటీ చేయాలని భావించారు.ఆయన నియోజకవర్గంలో పర్యటించారు కూడా. అయితే అనూహ్యంగా చంద్రబాబు సుహాసిని పేరును తెరపైకి తెచ్చారు. అప్పటి వరకూ సుహాసిని అంటే ఎవరికీ తెలియదు. నందమూరి కుటుంబ వారసురాలిగా ఆమెను పరిచయం చేసి బరిలోకి దింపారు. చంద్రబాబునాయుడు కూకట్ పల్లి నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చివరి నాలుగురోజుల్లో ఇక్కడే తిష్ట వేసి ప్రచారాన్ని నిర్వహించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా కూకట్ పల్లిలో విస్తృతంగా పర్యటించారు.

మంత్రులను దించినా....

ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రులందరినీ చంద్రబాబు కూకట్ పల్లిలోనే దించారు. పరిటాల సునీత, దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్ వంటి వారు కూకట్ పల్లిలో విస్తృతంగా ప్రచారం చేశారు. వ్యూహాలను రచించారు. కానీ అవేమీ వర్క్ అవుట్ కాలేదు. కులాల వారీగా ఆకట్టుకునేందుకు తంటాలు పడినా ఫలితం లేకుండా పోయింది. తొలి నుంచి కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి విజయం పై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అందరికీ అందుబాటులో ఉంటారన్నది ఆయనకు ప్లస్ గా మారింది.

జగన్, పవన్ లు దెబ్బేశారు....

సుహాసిని రాజకీయాలకు కొత్త కావడం, కూకట్ పల్లి లో ఉన్న సెటిలర్లు కులాల వారీగా విడిపోవడం సుహాసిని ఓటమికి కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకే పడ్డాయన్నది విస్పష్టమయింది. ఇక్కడ కాపు సామాజిక వర్గం, మైనారిటీలు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం కూడా టీఆర్ఎస్ కు కలసి వచ్చిందిగా చెబుతున్నారు. అదే మాధవరంకృష్ణారావు విజయానికి కారణమయింది. మొత్తం మీద కూకట్ పల్లి మరో కల్వకుర్తి అవుతుందన్న మాటలు నిజమయ్యాయి. పాపం... సుహాసిని...!!!

Similar News