వేషాన్ని మార్చేస్తారా…?

మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత శివప్రసాద్ కన్పించడమే మానేశారు. వరసగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండుసార్లు [more]

Update: 2019-08-10 14:30 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత శివప్రసాద్ కన్పించడమే మానేశారు. వరసగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించిన శివప్రసాద్ ఈసారి ఓటమి పాలయ్యారు. జగన్ గాలిలో ఆయన కొట్టుకుపోయారు. దీంతో శివప్రసాద్ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో భవిష‌్యత్ లేదని భావిస్తున్నారట. ఇందుకు కారణాలు కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

పదేళ్లపాటు ఎంపీగా……

శివప్రసాద్ చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా పదేళ్ల పాటు పనిచేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, ప్రత్యేక హోదా కోసం ఆయన పార్లమెంటులో పోరాడిన తీరు అందరికీ తెలిసిందే. అలాగని శివప్రసాద్ ఎన్నికలకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు. తిరుపతిలో ఒక స్థల వివాదంలో ఆయన చిక్కుకున్నారు. దీంతో పాటు దళితులకు అన్యాయం జరుగుతుందని ఆయన టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా గళం విప్పారు కూడా. శివప్రసాద్, చంద్రబాబు ఇద్దరూ అత్యంత సన్నిహితులు. చంద్రబాబు శివప్రసాద్ ను పిలిచి తలంటడంతో ఎన్నికలకు ముందు తగ్గారు.

మామా అల్లుళ్లిద్దరూ….

చిత్తూరు ఎంపీ స్థానాన్ని శివప్రసాద్ కు, కడప జిల్లాలోని రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆయన అల్లుడు నరసింహప్రసాద్ కు చంద్రబాబు టిక్కెట్లు కేటాయించారు. మరో అల్లుడు వేణు సత్యవేడు టిక్కెట్ అడిగినా చంద్రబాబు ఇవ్వలేదు. పోటీ చేసిన మామా అల్లుళ్లిద్దరూ ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు శివప్రసాద్ దూరమయ్యారంటున్నారు. ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను కాకున్నా తన అల్లుళ్ల భవిష్యత్ కోసం పార్టీని వీడాలన్న యోచనలో ఉన్నారు.

బాబు మెజారిటీ తగ్గడంతో…

నిజానికి శివప్రసాద్ రెండు సార్లు గెలిచింది చంద్రబాబు పుణ్యమే. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కుప్పం నియోజకవర్గం మెజారిటీతోనే శివప్రసాద్ గెలుస్తూ వచ్చారు. అయితే ఈసారి చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా ఏ అసెంబ్లీ స్థానం దక్కకపోవడం, కుప్పంలోనూ చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గడంతో శివప్రసాద్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి జగన్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.

Tags:    

Similar News