సీనియర్లు ఎందుకు క్యూ కట్టారంటే....?

Update: 2018-12-11 15:30 GMT

కాంగ్రెస్ సీనియర్ నేతలు క్యూ కట్టారు. సీనియర్ నేతలుగా చెప్పుకుంటూ, సీఎం రేసులో ఉన్నామని డప్పాలు కొట్టుకుంటున్న నేతలు ఈ ఎన్నికల్లో చతికల పడ్డారు. అగ్రనేతలు ఢిల్లీ చుట్టూ ప్రదిక్షిణలు చేసి మరీ టిక్కెట్లు తెచ్చుకున్నా....ఫలితం మాత్రం తిరగబడింది.కాంగ్రెస్ సీనియర్లు ఓటమికి గల కారణాలేంటి? టీఆర్ఎస్ కు బలంగా వీచిన సమయంలోనూ కొందరు ఊహించని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎలా గెలుపొందారు...? ఇదే కాంగ్రెస్ లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న. తెలంగాణ ఎన్నికల ఫలితాలు అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తామన్న సీట్లలో సయితం ఓటమి పాలు కావడం వారిని నిశ్చేష్టులను చేసిందనే చెప్పాలి.

వరుసగా ఒక్కొక్కరుగా.....

కాంగ్రెస్ సీనియర్ నేతలు... అనుభవం ఉన్న లీడర్లు... కె.జానారెడ్డి, డీకే అరుణ, రేవంత్ రెడ్డి, మల్లు రవి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ, నాగం జనార్థన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, కొండా సురేఖ...ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. కాంగ్రెస్ ఆశాకిరణాలుగా భావిస్తున్న వారిని సయితం ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ఇందుకు అనేక కారణాలున్నాయంటున్నారు. సీనియర్లు తాము ఖచ్చితంగా గెలుస్తామన్న ఆత్మవిశ్వాసంతో పోలింగ్ సక్రమంగా చేయించుకోక పోవడం వల్లనే గెలుపునకు దూరమయ్యారన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

తిరుగులేదన్న ధీమా.....

నాగార్జునసాగర్ లో జనారెడ్డికి తిరుగులేదనుకున్నారు. ఆయనకు ప్రచారంలో కూడా కొన్నిగ్రామాల ప్రజలు ఎదురుతిరిగినా జానారెడ్డి ఖచ్చితంగా గెలుస్తారని లెక్కలు కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య జెయింట్ కిల్లర్ అవుతారని ఎవరూ ఊహించలేదు. గత ఎన్నికల్లో సీపీఎం నుంచి టీఆర్ఎస్ లో చేరిన నోముల నరసింహయ్య నియోజకవర్గంలోనే ఎక్కువగా పర్యటించారు. అలాగే డీకే అరుణది కూడా అదే పరిస్థితి. గద్వాల కంచుకోటగా ఆమె భావించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కనీసం పోటీ ఇస్తారని కూడా ఊహించలేదు. కానీ ఊహించని విధంగా డీకే అరుణ పరాజయం పాలయ్యారు.ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా ఆయనకు విజయం సాధించిపెట్టలేదు.

ప్రభుత్వ వ్యతిరేకతపైనే.....?

ఇక గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కొండా సురేఖలు కూడా అతి విశ్వాసమే వారి కొంపముంచిందని చెప్పకతప్పదు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తమను కాపాడుతుందని గుడ్డిగా నమ్మారు. దీంతో సీనియర్ నేతలను సయితం ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వ వ్యతిరేకతపైనే గెలుపు ఉంటుందని ఆరాట పడిన సీనియర్ నేతలు నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేయలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొక్కుబడి యాత్రలు చేసి మమ అనిపించారు. దీంతో ప్రజాసంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు పెద్దపీట వేశారు. సీనియర్లు ఇంటి దారి పట్టారు. స్వయంకృతాపరాధమే సీనియర్ల ఓటమికి కారణమని చెప్పకతప్పదు.

Similar News