మహాకూటమి భయపడినట్లే జరిగిందా ...?

Update: 2018-12-07 12:30 GMT

దేశ ప్రజాస్వామ్యానికి అసలు పరీక్ష జరుగుతున్నప్పుడు అక్షరాస్యులు డుమ్మా కొడుతున్నారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుని విజ్ఞులైన వారిని ఎన్నుకోవాలిసిన సమయంలో విద్యావంతులు పోలింగ్ బూత్ కి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తుంది. పోలింగ్ ముమ్మరంగా జరిగి ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అని భావించి సెలవు ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. అయితే ఈ సెలవును తమ వ్యక్తిగత పనులకు హాలిడే టూర్స్ కి ఉపయోగించుకుంటున్నారు కొందరు. ఎన్నికల సెలవు కి తోడు రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో మరో రెండు రోజులు సెలవు పెట్టి మరీ ప్రయివేట్ ఉద్యోగులు చక్కా పోతున్నారు.

కూటమిలో గుబులు అదే ...

సీమాంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ లో స్థిరపడిన వారు భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా నివాసం వుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని భావించిన మహాకూటమి కి అర్బన్ ఓటర్లు డుమ్మా కొట్టడం ఆందోళన కలిగిస్తుంది. సీమాంధ్రుల పరిస్థితి ముందే అంచనా వేసి టిడిపి అధినేత ఓటర్లలో చైతన్యం తెచ్చే ప్రయత్నం తన ప్రచార సభల్లోనూ రోడ్ షో లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలితం అంతగా లేకపోయింది. పోలింగ్ మరికొద్ది గంటల్లో ముగుస్తుంది అనగా మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి లలో పోలింగ్ మధ్యాహ్నానికి 50 శాతం మించి పూర్తి కాకపోవడం చదువుకున్న ఓటర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దం.

సంక్రాంతి తరహాలో ...

సంక్రాంతి పండుగ సమయంలో ఎవరైనా హైదరాబాద్ వెళితే ఆశ్చర్య పోతారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో వుండే రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి. రైళ్లు, బస్సులు కిటకిట లాడిపోతాయి. కారణం సీమాంధ్రులు తమతమ ప్రాంతాలకు తరలిపోవడం అనే చెప్పొచ్చు. అదే తీరులో ఇప్పుడు కూడా వరుస సెలవుల ప్రభావంతో అంతా తమ సొంత ఊర్లకు తరలిపోయారు. దాంతో వీరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహాకూటమి అభ్యర్థుల్లో నిరాశ ఆవహించింది. అయితే కొందరు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించిన తరువాత ఊర్లకు బయల్దేరినట్లు సమాచారం లభించడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

Similar News