పైలెట్.... నువ్వే హైలెట్.....!!

Update: 2018-12-12 16:30 GMT

సులవుగా వస్తుందనుకున్న రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చెమటోడ్చాల్సి వచ్చింది. చివరకు మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా రావడం ఇప్పుడు ఆ పార్టీని షాక్ గురిచేస్తోంది. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలుండగా 199 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. మరో స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఫైనల్ గా భారత జాతీయ కాంగ్రెస్ కు 99, భారతీయ జనతా పార్టీకి 73, బహుజన్ సమాజ్ పార్టీకి ఆరు, ఇతరలకు 21 స్థానాలు దక్కాయి. ఒకరకంగా కాంగ్రెస్ అధికారం సొంతంగానే ఇక్కడ చేపట్టడానికి వీలుంది. లేకుంటే మాయావతి సహకారం తీసుకోవాల్సి వస్తుంది.

సీఎం ఎవరు?

అయితే రాజస్థాన్ ఇప్పుడు సీఎం ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లు ఇద్దరూ పోటీ చేశారు. సర్దార్ పుర నుంచి అశోక్ గెహ్లాట్, టోంక్ నియోజకవర్గం నుంచి సచిన్ పైలెట్ లు గెలిచారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారన్నది దాదాపుగా అందరికీ తెలిసిందే. అయితే రాహుల్ ఫైనల్ డెసిషన్ ఎవరి వైపు ఉంటుందన్నదే ఇప్పుడు అందరి సందేహం. ఇద్దరూ ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్నారు.

పైలెట్ వల్లనే.....

సచిన్ పైలెట్ గత కొంత కాలంగా పార్టీ పటిష్టతకు గట్టిగా పనిచేస్తున్నారు. వసుంధరరాజే ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు నిరసనలను తెలియజేస్తే వివిధ వర్గాలకు ఆయన అండగా నిలిచారు. ప్రధానంగా ఆయన రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపి వారికి అండగా నిలిచారు. దీంతోనే అతి కష్టం మీద రాజస్థాన్ ను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోగలిగింది. పీసీసీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నమ్మకాన్ని నిలబెట్టారు సచిన్. అంతేకాకుండా పీసీసీ చీఫ్ గా అందరిని సమన్వయం చేసుకుని వెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారు.

గెహ్లాట్ ను దింపింది అందుకేనా?

ఇక ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అశోక్ గెహ్లాట్ ను రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించడానికి కూడా కారణాలున్నాయని చెబుతున్నారు. టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సచిన్ పైలట్ గెలుపోటములపై ఉన్న సందేహంతోనే అశోక్ గెహ్లాట్ ను రాహుల్ బరిలోకి దించారంటున్నారు. ఒకవేళ సచిన్ ఓటమి పాలయితే బాధ్యతలను గెహ్లాట్ కు అప్పగించవచ్చని ముందు జాగ్రత్తగా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయించారంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం పైలెట్ నే ముఖ్యమంత్రిని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Similar News