సబ్బం..ఆహా... ఏమి గడుసుదనం....??

Update: 2018-12-14 13:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన ఎంపీ సబ్బం హరి రాజకీయ పయనం ఏంటో ఆయనకే కాదు, వెంట ఉన్న అనుచరులకు కూడా అర్ధం కావడం లేదు. తాను రాజకీయాల్లో చురుకుగా ఉన్నానని అంటూనే సబ్బం హరి తొందరలోనే ఓ రాజకీయ పార్టీలో చేరుతానని చెబుతూ వస్తున్నారు. గత ఆరేడు నెలలుగా ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప హరి ఏ పార్టీలో చేరుతారన్నది మాత్రం తనకు తానుగా చెప్పకుండా గడుసుదనం ప్రదర్శిస్తున్నారు. దాంతో ఆయన ప్రకటనలకు కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోతోంది. తనను అన్ని పార్టీలూ ఆహ్వానిస్తున్నాయని, అందరూ తన మిత్రులేనని చెప్పుకుంటున్న సబ్బం హరి మరి ఏ పార్టీలోనైనా ఎందుకు చేరలేకపోతున్నారో అర్ధం కావడంలేదు.

కాంగ్రెస్ లో పుట్టి....

ఇక సబ్బం రాజాకీయ జీవితం అంతా కాంగ్రెస్ లోనే సాగింది. ఆ పార్టీలో పుట్టి పెరిగిన ఆయన వైఎస్సార్ ప్రాపకంతో అనకాపల్లి ఎంపీ సీటు గెలిచారు. వైఎస్సార్ మరణం తరువాత కొన్నాళ్ళ పాటు వైసీపీలో జగన్ పక్కన ఉన్నా తన వైఖరితో అక్కడ ఇమడలేక అందులో నుంచి కూడా బయటకు వచ్చేశారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి కూడా చివరి నిముషంలో విరమించుకున్న సబ్బం హరి చాలాకాలంగా టీడీపీలోకి వెళ్దామనుకుంటున్నారు. అందుకోసం చంద్రబాబుని ఓ స్థాయిలో పొగుడుతూ వస్తున్నారు. అయినా ఆయనకు అక్కడ నుంచి పిలుపు రావడం లేదు. ఈ నేపధ్యంలో జనం మరచిపోకుండా ఉండేందుకు అపుడపుడు మీడియా ముందుకు వస్తున్న హరి తాను వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అని వూరిస్తున్నారు.

ఆఫర్లున్నాయట.....

తనకు అన్ని పార్టీల నుంచి ఆఫర్లు ఉన్నాయని ఈ మాజీ ఎంపీ చెప్పుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ సహా చాలా పార్టీలు పిలుస్తున్నాయని, తాను ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు. మరి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని నెలలు పడుతుందా అని సెటైర్లు పడుతున్నాయి. నిజానికి సబ్బం హరికి జగన్ తో చెడింది. దాంతో వైసీపీలో ఆయనకు చాన్సే లేదు. జనసేన పవన్ ని సైతం ఆయన విమర్శించి అక్కడా చేటు తెచ్చుకున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఈ రెండు పార్టీలే ఇపుడు ఆయన ముందు ఉన్న ఆప్షన్లు.

బాబు మెప్పు పొందేందుకేనా...?

అయితే ఆయన మనసు టీడీపీ మీదనే ఉంది. ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే, మంత్రి కావాలని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆయనకు జిల్లా మంత్రుల నుంచి అంతా నో ఎంట్రీ బోర్డ్ చూపిస్తున్నారు. ఈ దశలో ఆశ చావని మాజీ ఎంపీ గారు రాజకీయ విశ్లేషణలు చెబుతూ మరో లగడపాటి లా మారారని అంటున్నారు. తెలంగాణాలో టీడీపీ ఓడిపోయాక ఏపీలో ఎలా ఉంటుందన్నది తెలియక తమ్ముళ్ళు తల్లడిల్లుతూంటే బాబే మళ్ళీ కాబోయే సీఎం అంటూ సబ్బం హరి భారీ ప్రకటన ఇచ్చేశారు. ఈ విధంగా బాబు కళ్ళలో పడి టీడీపీలోకి రావాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయన జిమ్మిక్కులు కుదరవని, ఆయన ఆధిపత్య ధోరణిని టీడీపీలో ఎవరూ సహించరని, అందుకే పార్టీలోకి తీసుకోవడంలేదని కూడా తమ్ముళ్ళు అంటున్నారు. మరి మాజీ ఎంపీ గారు ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో, బాబు ఏ విధంగా దయ చూపుతారో చూడాలి.

Similar News