సబ్బం సోపు వేస్తున్నా...అడ్డుకుంటుందెవరు.??

Update: 2018-12-06 12:30 GMT

విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు దూరదృష్టితో ఆ పార్టీ చేరికలను అడ్డుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీలో చేరాలని పలువురు సీనియర్లు భావిస్తున్నా మంత్రి గారు మాత్రం కోరి మరీ అడ్డుపుల్లలు వేస్తున్నారట. దీంతో చంద్రబాబు సైతం గంటా మాట విని బ్రేకులు వేస్తున్నారని భోగట్టా. అలా మంత్రి గారి వ్యూహలకు చిత్తు అయిన నేతగా ఇపుడు కళ్ళ ముందు సబ్బం హరి కనిపిస్తున్నారు. ఆయన ఎంతగా బాబుకు భజన చేస్తున్నా గంటా మాత్రం దయ చూపించడంలేదని టాక్.

సైకిలెక్కాలని సరదా...

కాంగ్రెస్ రాజకీయాల్లో పుట్టి ఎదిగిన మాజీ ఎంపీ హరికి ఇపుడు టీడీపీ సరైన పార్టీగా కనిపిస్తోంది. ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి గిరీని కూడా పట్టేయవచ్చునని హరి బాగానే ప్లాన్ వేశారు. అందుకోసం ఆయన మీడియా ముఖంగా బాబును పొగడడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు తిరుగులేదని చెబుతూ హై కమాండ్ కన్నుల్లో పడ్డారు. ఇలా గత రెండేళ్ళుగా హరి టీడీపీలో చేరాలని విశ్వప్రయత్నమే చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇద్దరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం హరి రాకను వ్యతిరేకించడం విశేషం. హరిది డామినేటింగ్ క్యారక్టర్. ఆయన కనుక వస్తే తమకే ఎసరు పెడతారన్న భయంతో అంతా ఒకే గొంతుకతో చేర్చుకోవద్దని చెప్పేశారు.

ఎప్పటికప్పుడు వాయిదా....

దీంతో ఎప్పటికపుడు హరి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన హరి కనుక టీడీపీలో చేరితే అర్బన్ జిల్లాలో తనకు పోటీ అవుతారని , మంత్రి పదవికి కూడా రేసులో ఉంటారని భావించిన గంటా ఆయన అవసరం లేదని పార్టీకి చెబుతున్నట్లుగా టాక్. ఇక ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకుని బలోపేతం చేయాలన్న అధినేత ఆలోచనల మేరకు ఉత్తర నియోజకర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును టీడీపీ వైపుగా రప్పించేందుకు మంత్రి గంటా ప్లాన్ వేస్తున్నారట. ఆయన కనుక‌ వస్తే ఇక హరికి పూర్తిగా ద్వారాలు మూసుకుపోయినట్లేనని అంటున్నారు.

పట్టు వీడని హరి....

ఇదిలా ఉండంగా ఎలాగైనా టీడీపీలో చేరాలని హరి పట్టుపడుతూనే ఉన్నారు. అందుకోసం ఆయన తనదైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. బాబు కోటరీ నేతలతోనీ తనకు అనుకూలంగా చెప్పిస్తున్నారని అంటున్నారు. తమ నాయకుడు ఉత్తర నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని, టీడీపీలో చేరడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి హరి, మంత్రి మధ్యన సాగుతున్న ఈ ఎత్తులు పై ఎత్తుల వ్యవహారంలో చంద్రబాబు ఎటు వైపు మొగ్గుతారో చూడాలి. ఇపుడున్న పరిస్థితుల్లో మంత్రి గంటా మాటే చలామణీ అయితే మాత్రం హరికి నో ఎంట్రీ బోర్డ్ తప్పదని తమ్ముళ్ళు అంటున్నారు.

Similar News