రోజాకు ఫుల్ వేవ్ ఉందే...!!!

Update: 2018-12-29 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారా? ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే పార్టీ ఇబ్బందుల పాలవుతుందని భయపడుతున్నారా? ఇది ఎక్కడో కాదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులోనే. చిత్తూరు జిల్లాలో నగరి నియోజకవర్గానికి ఇప్పటి వరకూ ఇన్ ఛార్జిని నియమించలేదంటే చంద్రబాబు ఈ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారంటున్నారు. నగరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెద్దగా పట్టులేదు. ఇప్పటికి ఈ నియోజకవర్గంలో పన్నెండు సార్లు ఎన్నికలు జరిగితే మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ టీడీపీకి అంత ఈజీ కాదన్న సంగతి తెలిసిందే.

గాలి ఎంట్రీ తర్వాత.....

2009 ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమనాయుడు నగరిలో గెలిచిన తర్వాత పార్టీకి కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి. గాలి నగరి నియోజకవర్గంలో అడుగుపెట్టిన తర్వాత టీడీపీకి తిరిగి ప్రాణ ప్రతిష్ట జరిగిందనే చెప్పాలి. అయితే గాలి ముద్దు కృష్ణమనాయుడు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రోజాపై 858 ఓట్ల మెజారిటీతోనే ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్.కె.రోజా 2004లో ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగాపోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి వారి చెంగారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీలో గెలవలేని రోజా 2014 ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచారు.

ఇన్ ఛార్జి ఏరీ...?

అయితే ఇప్పటివరకూ నియోజకవర్గానికి చంద్రబాబునాయుడు ఇన్ ఛార్జిని నియమించలేదు. ఇందుకు కారణాలున్నాయి. గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణించిన తర్వాత ఆయన కుమారులిద్దరూ సీటు కోసం, ఇన్ ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ పదవిని కూడా గాలి కుటుంబంలో విభేదాల కారణంగా ఆయన సతీమణికి చంద్రబాబు ఇవ్వాల్సి వచ్చింది. గాలి కుమారులు భాను ప్రకాష్, జగదీష్ లు ఇద్దరూ పోటీ పడుతుండటంతో ఎవరిని ఇన్ ఛార్జిగా నియమించినా మరొకరు ప్రత్యర్థి పార్టీలో చేరే అవకాశముందని భావించి నిర్ణయాన్ని పక్కనపెట్టేశారు. దీంతో నగరి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ ఛార్జి లేకుండా పోయారు.

సొంత నిధులతో......

సభ్యత్వ నమోదులో కూడా నగరి నియోజకవర్గం వెనకబడి ఉండటం టీడీపీ అధినేతకు ఆందోళన కల్గిస్తోంది. మరోవైపు రోజా ఈ పరిణామాలతో చాలా రిలీఫ్ గా ఉన్నారట. ఆమె మరోసారి తన విజయం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. ఆమె ఇప్పటికే నగరిలో సొంత ఇల్లు నిర్మించుకుని అక్కడే ఉంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. అన్న క్యాంటిన్లకు ధీటుగా వైఎస్సార్ మొబైల్ క్యాంటిన్లు పెట్టి సొంత ఖర్చుతో పేదలకు నాలుగురూపాయలకే భోజనం అందిస్తున్నారు. మొత్తం మీద నగరిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రోజాకు అనుకూలంగా మారుతున్నాయన్నది విశ్లేషకుల అంచనా.

Similar News