రేసులో రేవంత్ ముందున్నారా..?

Update: 2018-11-10 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో సామాన్యుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ముందుండి. తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ వంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డి గత రెండు ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనతికాలంలోనే తన వాక్పటిమ, దూకుడు స్వభావంతో రాష్ట్రస్థాయి నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు. దీంతో రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించి నైతికంగా దెబ్బతీయాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు గానూ గత సంవత్సరం నుంచి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇక ఇటీవలే కాంగ్రెస్ లో రాష్ట్రస్థాయి పదవి దక్కించుకున్న రేవంత్ నియోజకవర్గం గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని... ప్రభుత్వం ఏర్పడితే కీలక పదవి దక్కించుకోవాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ పోరాటం చేస్తున్నారు.

సంవత్సరం నుంచే గ్రౌండ్ వర్క్

2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడే ఎన్నికలు వస్తాయని భావించిన టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని ఓడించేందుకు గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ బాధ్యతలను ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఇక్కడి నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన గుర్నాధ్ రెడ్డిని కాదని రేవంత్ రెడ్డిని ఎదుర్కొవడానికి ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డిని రంగంలోకి దింపారు. దీంతో గత సంవత్సరం నుంచి ఆయన ఇక్కడ పనిచేసుకుంటూ వెళుతున్నారు. అర్థబలం దండిగా ఉన్న నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి ధీటైన అభ్యర్థిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనుచరులను, స్థానిక సంస్థ సభ్యులను పెద్దఎత్తున టీఆర్ఎస్ గూటికి చేర్చారు. అసెంబ్లీ రద్దుకు ముందే కొడంగల్ లో పెద్దఎత్తున అభివృద్ధ కార్యక్రమాలు చేయించారు.

స్వంత నియోజకవర్గం కాకున్నా...

1952లో ఏర్పాటైన కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల శివారులో ఉంది. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో కేవలం అచ్చుతరెడ్డి ఒక్కరు మాత్రమే మంత్రిగా ఒకసారి పనిచేశారు. ఆరుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డికి కూడా మంత్రిగా అవకావం దక్కలేదు. దీంతో నియోజకవర్గంలో అభివృద్ధి పెద్దగా జరగలేదు. ఈ నాలుగేళ్ల కాలంలో కొడంగల్ చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే, వీటిని పూర్తిగా తమ ఖాతాలో వేసుకోలేకపోయింది ఆ పార్టీ. కొంతమంది టీఆర్ఎస్ వల్లె అభివృద్ధి అని నమ్ముతున్నా... మెజారిటీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నందునే అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి స్థానికేతరుడే అయినా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడం, ఇక ఎప్పటికీ తన స్వంత నియోజకవర్గం కొడంగలే అని చెప్పుకుంటుండటంతో రేవంత్ రెడ్డి తమ వాడే అన్న ముద్ర పడింది. ఇక ఇటీవల రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులు కూడా ప్రజల్లో ఆయనకు కొంత ప్లస్ అయ్యిందని తెలుస్తోంది. పైగా రేవంత్ రెడ్డి గెలిస్తే మంచి పదవి దక్కుతుందని ప్రజలు భావిస్తున్నారు.

ఫలిస్తున్న టీఆర్ఎస్ వ్యూహాలు

టీఆర్ఎస్ విషయానికి వస్తే ఇక్కడ గెలుపు కోసం చాలా శ్రమిస్తోంది. నరేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి పార్టీ విజయం కోసం బాగానే కష్టపడుతున్నారు. గురునాథ్ రెడ్డికి ఇక్కడ ప్రత్యేక గుర్తింపు, ఓటు బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నాయకులను తమవైపు తిప్పుకోవడంలో ఇప్పటికే సఫలీకృతమైంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉండటం కూడా కలిసివచ్చే అవకాశం ఉంది. నియోజకవర్గంలో యాదవ, ముదిరాజ్ సామాజకవర్గాలు ఎక్కువ ప్రభావితం చూపిస్తాయి. వీరిలో అత్యధికులు టీఆర్ఎస్ వైపు ఉంటారనే అంచనాలు ఉన్నాయి. ఇక ఎంఐఎంతో స్నేహం కారణంగా ముస్లిం ఓట్లు కూడా టీఆర్ఎస్ వైపే ఉండే అవకాశం ఉంది. అయితే, టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు రేవంత్ రెడ్డిని నియోజకవర్గానికి పరిమితం అయ్యేలా చేస్తున్నాయి. టఫ్ ఫైట్ ఉంటుందని గుర్తించిన రేవంత్ ఎక్కువ సమయం కొడంగల్ కే కేటాయిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నట్లుగా ఆయన గెలుపు నల్లెరు మీద నడక అయితే కాకున్నా... ఇప్పటికైతే ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, పరిస్థితిని క్రమంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్న టీఆర్ఎస్ ఆఖరి వరకు సీన్ మార్చే అవకాశం కూడా ఎక్కువే ఉందంటున్నారు.

Similar News