పార్టీ మారడమే శాపమయిందా..?

Update: 2018-12-12 08:00 GMT

టీఆర్ఎస్ లో టిక్కెట్ పెండింగ్ లో పెట్టడాన్ని జీర్ణించుకోలేక గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. తమను పరకాల ప్రజలు కచ్చితంగా అక్కున చేర్చుకుంటారని భావించిన వారికి ఊహించని షాక్ ఇచ్చారు. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖపై టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సుమారు 50 వేల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే, వరంగల్ జిల్లా రాజకీయాలను దగ్గరగా పరిశీలించే వారంత ఈసారి కొండా సురేఖ ఓటమి ఖాయమని అంచనా వేశారు. కానీ, కేవలం 5 లేదా 10 వేల మెజారిటీతోనే చల్లా గెలిచే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ కి మెజారిటీ వచ్చింది. కొండా దంపతుల అతివిశ్వాసం, స్వయంకృతం వల్లే ఓడిపోయారని అంటున్నారు.

ఐదేళ్లు పరకాలకు దూరంగా ఉండటంతో...

టీఆర్ఎస్ కొండా దంపతులకు టిక్కెట్ ను నిరాకరించలేదు... కేవలం పెండింగ్ లో పెట్టింది. అయినా కొండా దంపతులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో వారు టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ సమయంలో కేసీఆర్ పాలనపై, కేటీఆర్ వైఖరిపై వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. కచ్చితంగా తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, గత ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఆమె తన స్వంత నియోజకవర్గం పరకాల నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పరకాల టిక్కెట్ తెచ్చుకుని అక్కడి నుంచి పోటీ చేశారు. పరకాల అయితే కచ్చితంగా గెలిస్తామని వారు అతివిశ్వాసానికి పోయారు. వాస్తవానికి పరకాలలో కొండా దంపతులు ఐదేళ్ల క్రితం బలంగానే ఉన్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి స్వంత ఇమేజ్ తో గెలిచిన చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లి నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెసుకున్నారు.

అభివృద్ధి మంత్రమే ఫలించింది...

చల్లా ధర్మారెడ్డి హయాంతో పరకాల బాగా అభివృద్ధి చెందిందని ప్రజలు గుర్తించారు. ధర్మారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. దీంతో పాటు ఆయన ముందునుంచే కొండా దంపతుల అస్త్రాలను విరిచేస్తూ వచ్చారు. వారికి బలమైన అనుచరులుగా గతంతో ఉండి ఇప్పుడు తనవద్ద ఉన్న మండల స్థాయి నేతలను చేజారకుండా చూసుకున్నారు. కొండా దంపతులకు కొన్ని గ్రామాల్లో ఏమాత్రం క్యాడర్ దొరకకుండా చూసుకున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో పోలింగ్ బూత్ లలో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టలేని స్థితిలోకి కొండా దంపతులు వెళ్లారు. దీనికి తోడు టీఆర్ఎస్ పెద్దలు కూడా కొండాను ఓడించేందుకు పరకాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు చల్లా ధర్మారెడ్డికి సూచనలు ఇస్తూ వచ్చారు. అయితే, చల్లా ధర్మారెడ్డి కాంట్రాక్టర్ అని, మట్టి దొంగ అంటూ కొండా దంపతులు ఎన్ని ఆరోపణలు చేసినా... టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం, వ్యూహాల ముందు కొట్టుకుపోయాయి. దీంతో నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ మెజారిటీతో ధర్మారెడ్డి విజయం సాధించారు.

Similar News