సిట్టింగ్ లకు సినిమా చూపించారుగా..!

Update: 2018-12-12 05:00 GMT

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఆ పార్టీలో హేమాహేమీలుగా గుర్తింపు పొందిన, ప్రభుత్వమే వస్తే కీలక స్థానాల్లో ఉండే నేతలుగా ఉన్న వారికి దారుణ పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో కేవలం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మినహా ఎవరూ కాంగ్రెస్ సిట్టింగ్ లు అంతా ఓడిపోయారు. వరుసగా పలుమార్లు గెలిచి ఉండటంతో సహజంగానే ప్రజల్లో ఏర్పడే వ్యతిరేకత, వీరి స్థానాల్లో టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో వారు ఓటమి పాలయ్యారు.

పక్కాగా ప్లాన్ చేసిన టీఆర్ఎస్

గత ఎన్నికల సమయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే ఈ ఎన్నికల్లోనూ అనుసరించారు. గత ఎన్నికల్లో బలమైన కాంగ్రెస్ నేతలు ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి కూడా వారిని బలంగా ఢీకొట్టే అభ్యర్థులను వెతికి మరీ నిలబెట్టి సక్సెస్ అయ్యారు. దీంతో చాలామంది కాంగ్రెస్ ముఖ్యనేతలు గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇదే స్ట్రాటజీని ఈసారి కూడా టీఆర్ఎస్ అవలంభించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ముఖ్యనేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ వంటి వారిని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ టార్గెట్ చేశారు. వీరిపై గత ఎన్నికల్లో ఓడిన వారినే మళ్లీ నిలబెట్టి సానుభూతిని క్యాష్ చేసుకుంది.

ఓటమికి కారణాలివే..?

కాంగ్రెస్ ముఖ్యనేతలంతా వరుసగా పలుమార్లు గెలిచినవారే ఎక్కువగా ఉన్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వరుసగా నాలుగుసార్లు, గీతారెడ్డి, డీకే అరుణ మూడుసార్లు గెలిచి ఉండటం, చిన్నారెడ్డి, రేవంత్ రెడ్డి రెండుసార్లు గెలిచి ఉండటంతో వారిపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇది టీఆర్ఎస్ కి బాగా కలిసివచ్చింది. ఇక, ఈ స్థానాల్లో ప్రచారానికి కూడా కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ తరపున ప్రత్యేకంగా ఎన్నికల ఇంఛార్జిలను నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని కేసీఆర్ సమీక్షించి గెలుపు కోసం టీఆర్ఎస్ అభ్యర్థులకు సూచనలు చేస్తూ వచ్చారు. వీరితో పాటు వంశీచంద్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, సంపత్ కుమార్, పద్మావతి రెడ్డి వంటి కాంగ్రెస్ సిట్టింగ్ లు కూడా ఓటమి పాలయ్యారు. గెలిస్తే ఎక్కడో ఉంటామనుకున్న కాంగ్రెస్ కీలక నేతలు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది.

Similar News