రావెల‌కు జ‌న‌సేనాని ప‌రీక్ష‌.. ఏంటంటే...!!

Update: 2018-12-20 13:30 GMT

మాజీ మంత్రి, మాజీ టీడీపీ నాయ‌కుడు రావెల కిశోర్ బాబు.. ఇటీవ‌ల కాలంలో హ‌డావుడి ఎక్కువ‌గా చేస్తున్నార‌ట‌. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుస్తున్నారు. అనూహ్యంగా వ‌చ్చిన ఈ మార్పును చూసి ప్ర‌తి ఒక్క‌రూ ముక్కున వేలేసుకుంటున్నారు. అదేంటి.. అధికార పార్టీలో ఉన్న ప్పుడు కూడా ఇలా ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగ‌లేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు తిరుగుతున్నాడు? అని చ‌ర్చించుకుంటున్నారు. 2014లో అనూహ్యంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రావెల .. టీడీపీ టికెట్‌పై రాజ‌ధిని గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి విజ‌యం సాధించి.. చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలోనూ స్థానం పొందారు. అయితే, అనూహ్య కార‌ణాల నేప‌థ్యంలో ఆయ‌న కేబినెట్‌కు దూర‌మ‌య్యాడు.

జనంలోనే ఉండాలని....

ఇక‌, ఇటీవ‌లే జ‌న‌సేన‌లో చేరి జైకొట్టాడు రావెల‌. ఎస్సీ వ‌ర్గానికి చెందిన రావెల‌.. ఈ నాలుగున్న‌రేళ్ల‌లో ఎమ్మెల్యేగా మంత్రి గా కూడా తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. గ‌తేడాది జ‌రిగిన ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి పోయాక తొలుత ఆయ‌న‌కు వైసీపీలో చేరాల‌ని అనిపించినా.. ప‌రిస్థితి అనుకూలించ‌క‌పోవ‌డంతో ఆయ‌న జ‌న‌సేనానికి జై కొట్టాడు. ఇంత వ‌ర‌కు ప‌రిస్థితి బాగానే ఉన్నా.. ఇప్పుడు రావెల‌కు అస‌లు సిస‌లు అగ్ని ప‌రీక్ష ఎదురైంది. ఎన్నిక‌ల‌కు సమ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండండి.. జ‌న‌సేన అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లండి మీ బ‌లాన్ని పెంచుకోండి. అంటూ జ‌న‌సేనాని రావెల‌కు బోధించార‌ట‌.

బలం తెలుసుకున్న తర్వాతే...

అంతేకాదు, ముందు మీ బ‌లం ఎంతో తెలుసుకుంటే..దానిని బ‌ట్టి ఎన్నిక‌ల ప్ర‌ణాళిక ఏంటో నేను చెబుతాను అనే స‌రికి.. రావెల ఒక్క‌సారిగా ఖంగు తిన్న‌ట్టు అనిపిస్తోంది. దీంతో ఆయ‌న గ‌డిచిన రెండు రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ దిరుగుతున్నాడు. త‌న సొంత బ‌లాన్ని స‌మీక‌రించేందుకు త‌న సామాజిక వ‌ర్గం నేత‌ల‌తో క‌లిసేందుకు మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే, దీనికి ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఒక్క‌సారిగా ఆలోచ‌నలో ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి రావెల‌కు సొంత బ‌లం అంటూ ఏమీలేదు. టీడీపీకి ఉన్న బ‌లాన్నే ఆయ‌న బ‌లంగా ఊహించుకునేవారు. ముఖ్యంగా త‌న సామాజిక వ‌ర్గంలోనే త‌న‌కు ఎదురు గాలులు వీస్తున్నాయి.

పట్టు కోసం...?

మంత్రి ప‌ద‌వి పోయాక కూడా ఆయ‌న సొంత సామాజిక‌వ‌ర్గంలో హైలెట్ అయ్యేలాగానే పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. గ‌త యేడాది కాలంగా రావెల పార్టీ బ్రాండ్‌తో సంబంధం లేకుండా తాను వ్య‌క్తిగ‌తంగా హైలెట్ అయ్యేలా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు టీడీపీ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఆ పార్టీ నుంచి ఆయ‌న వెంట ఒక్క‌రు కూడా బ‌య‌ట‌కు రాలేదు. ఇక‌, జ‌న‌సేన బ‌లం చూసుకుని గెలుపు గుర్రం ఎక్కాల‌న్నా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు మండ‌లాల్లో మిన‌హా ప‌రిస్థితులు అంత సానుకూలంగా ఉండేలా లేవు. ఏదేమైనా ఇప్పుడు ప‌వ‌న్ సూచ‌న‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టుకోసం రావెల చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌డం లేదు.

Similar News