సెటిలర్లే సెటిల్ చేసేస్తారా?

Update: 2018-07-13 11:00 GMT

మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొత్త మనోహర్ రెడ్డి భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో తీగల కృష్ణారెడ్డికి ప్రజల్లో అంతగా మార్కులు పడటం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉంది. ఆ పార్టీ నుంచి అంతకుముందు పోటీ చేసిన సబిత ఇంద్రారెడ్డి గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో చివరి నిమిషంలో మల్ రెడ్డి రంగారెడ్డికి ఇచ్చినా ద్వితీయ స్థానంలో నిలిచారు. ఇప్పుడు మళ్లీ సబిత ఇంద్రారెడ్డి లేదా ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారు. వీరికి మంచి ఇమేజ్ ఉంది. దీంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు నెలకొననుంది.

మజ్లీస్ తో పొత్తు టీఆర్ఎస్ కి కలిసివచ్చేనా...

రాజేంద్రనగర్ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెండు పర్యాయాలూ ప్రకాశ్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో 25 వేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పై విజయం సాధించారు. ఇక్కడ టీఆర్ఎస్ నాలుగో స్థానానికి పరిమితైంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉండే ఇక్కడ మజ్లీస్ పార్టీకి సైతం మంచి ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు 50 వేల ఓట్లు సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో మజ్లీస్ తో కలిసి టీఆర్ఎస్ పోటీ చేయడం ఖాయంగానే కనపడుతోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది స్పష్టత లేదు. సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన నియోజకవర్గంలోనూ పర్యటిస్తున్నారు. ఒకవేళ వీరి కుటుంబం పోటీలో ఉంటే హోరీహోరీ పోరు ఉండనుంది. మజ్లీస్ తో పొత్తు టీఆర్ఎస్ విజయావకాశాలను మెరుగు పరిచే అవకాశం ఉంది.

సాఫ్ట్ వేర్ ఏరియాలో టీఆర్ఎస్ జెండా ఎగిరేనా..?

సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకి హబ్ గా ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సెటిలర్ ఓట్లే కీలకం. గత ఎన్నికల్లో వారు వన్ సైడ్ గా టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అరికేపూడి గాంధీ 75,904 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. దీనికి తోడు ఐటీ మంత్రిగా కేటీఆర్ ప్రత్యేక ముద్ర వేసుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటం టీఆర్ఎస్ కు అనుకూలంగా మారింది. అరికేపూడి గాంధీనే మరోసారి పోటీ చేయడం ఖాయంగా కనపడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ లేదా ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్ పోటీ చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడం వీరికి కలిసి రానుంది. అయితే, సెటిలర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గితే మాత్రం ఆ పార్టీ విజయాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదనే విశ్లేషణలు ఉన్నాయి.

చేవెళ్లలో కాంగ్రెస్ పట్టు నిలుపుకుంటుందా..?

గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. ఇక్కడి నుంచి హస్తం గుర్తుపై పోటీ చేసిన కాలె యాదయ్య టీఆర్ఎస్ అభ్యర్థి కే.ఎస్ రత్నంపై 781 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. తర్వాత ఆయన కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఈసారి ఆయనతో పాటు గత ఎన్నికల్లో ఓడిన కే.ఎస్ రత్నం కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన చేవెళ్ల నుంచి కాలె యాదయ్య పార్టీ మారడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో పడింది. కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉండటంతో పట్టు ఉన్న ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి పోటీలో ఉంటే తన సీటును నిలుపుకునే అవకాశం ఉంది. ఇక టీఆర్ఎస్ కూడా నియోజకవర్గంలో పటిష్ఠతంగా తయారైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ద్విముఖ పోటీ ఖాయంగా కనపడుతోంది.

పరిగి ఎమ్మెల్యేపై వ్యతిరేకత నిజమేనా..?

గత ఎన్నికలకు ముందు వరకూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్న హరీశ్వర్ రెడ్డి ఎన్నికలకు కొంత ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఆయన విజయం ఖాయం అన్న అంచనాలు ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి ఇక్కడ 5,163 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. బీజేపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మూడో స్థానానికే పరిమితమయ్యారు. అయితే, ప్రతిపక్షంలో ఉండటం వల్ల అభివృద్ధి పనులు అంతగా చేయలేకపోవడం, వివాదాలు ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి కొంత మైనస్ గా మారాయని తెలుస్తోంది. ఇక హరీశ్వర్ రెడ్డికి ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. దీంతో ఆయన పోటీ చేస్తారా లేదా ఇంకెవరినైనా బరిలో నిలుపుతారా అన్నది ప్రశ్నార్థకమైంది. హరీశ్వర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా ద్విముఖ పోరే ఉండనుంది.

వికారాబాద్ లో ఈసారైనా సత్తా చూపేనా...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వికారాబాద్ ఒకటి. ఇక్కడి నుంచి 2008 ఉప ఎన్నికల్లో, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గెలిచారు. దీంతో ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా అవకాశం దక్కింది. అయితే, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బి.సంజీవరావు ఆయనపై 10 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. టీఆర్ఎస్ హవా, గతంలో ఓడిపోయారనే సానుభూతి, ప్రజల్లో మంచి పేరుతో సంజీవరావు సులువుగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయనే అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాగా ఏర్పడటం ఆయనకు కలిసివచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, మంత్రిగా పనిచేసినప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, మాస్ లీడర్ ఇమేజ్ ఉండటం, పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ప్రసాద్ కుమార్ కి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే, టీఆర్ఎస్ లో ఒకప్పుడు కీలకపాత్ర పోషించి, ఐదుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన సీనియర్ నేత ఏ.చంద్రశేఖర్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనకు కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. దీతో ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ వచ్చినా టీఆర్ఎస్ కి మాత్రం గట్టి పోటీ ఇవ్వడం మాత్రం ఖాయం.

ఈసారి మంత్రిగారికి ఎదురులేదా..?

తాండూరు నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ పార్టీ తరుపున ప్రస్తుత మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ గూటికి చేరారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావుపై 15,982 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, అంగ, అర్థ బలాలు దండిగా ఉండటం, టీఆర్ఎస్ పార్టీ బలం రానున్న ఎన్నికల్లో మహేందర్ రెడ్డికి కలిసిరానున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. అయితే, పార్టీకి నియోజకవర్గంలో ఉన్న బలమైన ఓటు బ్యాంకు, నాలుగు పర్యాయాలు గెలిచిన మహేందర్ రెడ్డిపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చే అవకాశం ఉంది.

Similar News