రమణ్ సింగ్ మొత్తుకున్నా వినలేదే...?

Update: 2018-12-12 18:29 GMT

ఛత్తీస్ ఘడ్... భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు సాధించినా...ఛత్తీస్ ఘడ్ లో మాత్రం ఇది కుదరలేదు. దీనికి పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ పాలనపై వ్యతిరేకత ఒకవైపు ఉంటే.... బీజేపీ అధిష్టానం తీసుకున్న సొంత నిర్ణయాలు కూడా పార్టీ కొంప ముంచాయన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. రమణ్ సింగ్ మాట అధిష్టానం పెడచెవిన పెట్టిందన్న విమర్శలు ఉన్నాయి.

సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వొదన్నా.....

రమణ్ సింగ్ అధిష్టానానికి అత్యంత వీరవిధేయుడు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మూడు దఫాలు పార్టీని విజయంవైపు నడిపించడంలో ఆయన కృషిని ఎవరూ కాదనలేరు. పదిహేనేళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వంపై ప్రజలకు మొహం మొత్తుతుంది. ఇది కాదనలేని వాస్తవం. ఈ విషయాన్ని రమణ్ సింగ్ ముందుగానే గుర్తించారు. తమ కేబినెట్ సహచరులపైనా, ఎమ్మెల్యేలపైనా తీవ్ర వ్యతిరేకత ఉందని గుర్తించిన రమణ్ సింగ్ నష్ట నివారణ చర్యలు చేపట్టాలని అధిష్టానానికి సూచించారు.

అధిష్టానం పెడచెవిన పెట్టడంతో....

మంత్రివర్గంలో కొందరిని, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్న ఆయన మాటను అధిష్టానం బేఖాతరు చేసింది. సిట్టింగ్ లకే ఎక్కువ స్థానాలను కేటాయించడంతో పార్టీ ఘోరంగా ఓటమి పాలయింది. అయితే ఇది కేవలం ఎమ్మెల్యేల పై వ్యతిరేకత మాత్రమే కాదని రమణ‌్ సింగ్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం కూడా ఓటమికి కారణాలుగా కొందరు బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా రైతు వర్గాన్ని మచ్చిక చేసుకోవడంలో రమణ్ సింగ్ విఫలమయ్యారంటున్నారు. అలాగే పదిహేనేళ్లు పాటు తమకు అండగా ఉన్న గిరిజన వర్గం కూడా దూరమయిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ హామీలు....

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా ఛత్తీస్ ఘడ్ ప్రజలు విశ్వసించారంటున్నారు. రాహుల్ గాంధీ తన పర్యటనలో రైతు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ బలంగా ప్రజల్లోకి వెళ్లిందని చెబుతున్నారు. పవర్ లోకి వచ్చిన పదిరోజుల్లోనే రైతు రుణాలు మాఫీ చేస్తామన్న ప్రకటనను రైతు వర్గం విశ్వసించిందంటున్నారు. అలాగే 2006 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడంతో గిరిజనం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారంటున్నారు. మొత్తం మీద రమణ్ సింగ్ ఘోర ఓటమికి అనేక కారణాలున్నాయంటున్నారు.

Similar News