ఓటమికి అసలైన కారణం ఆయనేనట...?

Update: 2018-12-14 09:30 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ కు సునామీలా ఓట్లు రావడానికి కారణాలేంటి? చేయి పార్టీ చతికల పడటానికి ఏం జరిగింది? ఇప్పుడు ఇదే ప్రశ్న కాంగ్రెస్ అభిమానులందరినీ వేధిస్తుంది. తొలినుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కాంగ్రెస్ కు ఇక్కడ సరైన నాయకత్వం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. సీనియర్ నేతలు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరూ ఛరిష్మాఉన్న నేతలు లేకపోవడం ఆ పార్టీకి మైనస్ పాయింట్. ఇక అసలు విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా సరైనోడిని నియమించలేదన్న వ్యాఖ్యలుకూడా ఓటమి తర్వాత గాంధీ భవన్ లో విన్పిస్తున్నాయి.

సమర్ధుడిని నియమించి ఉంటే.....?

రామచంద్రుని కుంతియా. ఈయనను దిగ్విజయ్ సింగ్ తర్వాత తాత్కాలకి ఇన్ ఛార్జిగా పార్టీకి అధిష్టానం నియమించింది. తాత్కాలిక ఇన్ ఛార్జి అంటేకొద్దికాలమే అనుకున్నారు. గులాం నబీ ఆజాద్, ఆంటోని వంటి వారిని తెలంగాణకు ఇన్ ఛార్జిగా నియమిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఎన్నికల వరకూ కుంతియానే కొనసాగించారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముదుర్లు ఎక్కువన్న సంగతిని దాదాపు అందరూ అంగీకరిస్తారు. ప్రతి వాళ్లూ తమ కోటరీని నడుపుతుంటారు. ఈనేపథ్యంలో కుంతియా నియామకంపై తొలినాళ్లలోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సమన్వయం కుదర్చలేక....

కుంతియా పార్టీని సమర్థవంతంగా ఎన్నికల్లో తీసుకెళ్లగలరా? అన్న సందేహాలు ఆ పార్టీ నేతల నుంచి వ్యక్తమయ్యాయి. టిక్కెట్ల కేటాయింపులు, బుజ్జగింపులు భక్త చరణ్ దాస్, డీకే శివకుమార్, అహ్మద్ పటేల్ వంటినేతలకు అప్పగించినప్పటికీ వారుచివరినిమిషంలో రంగంలోకి దిగారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, టిక్కెట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరగడంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అటువైపు కేసీఆర్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో వారు దూసుకుపోతున్నా వీరు టిక్కెట్ల కోసం ఢిల్లీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండటం కూడా నష్టం జరిగిందంటున్నారు. నేతల మధ్య కుంతియా సమన్వయం తేలేకపోయారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

ప్రచారం ఏదీ?

శాసనసభ రద్దయిన తర్వాతైనా కుంతియాను మార్చి బలమైన నేతను ఇక్కడ ఇన్ ఛార్జిగా పెట్టి ఉంటే కొంతైనా ఫలితం దక్కేదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం రాహుల్ సభలను అక్కడక్కడా పెట్టి మ....మ.. అనిపించారు తప్ప నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారానికి ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకపోవడంకూడా నష్టానికి ఒక కారణం. కేవలం రాహుల్ చుట్టూ రాష్ట్రంలో తిరగడమే తప్ప కొంత ఇమేజ్ ఉన్న నేతలు నియోజకవర్గాల్లో పర్యటించకపోవడం కూడా ఓటమిపాలవ్వడానికి ఒక కారణంగా చూపుతున్నారు. వచ్చిన ఫలితాలను చూస్తే సీనియర్ నేతలే ఒకరి ఓటమికి మరొకరు కారణంగా చూపుతున్నారు. అలాగే టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ,కాంగ్రెస్ క్యాడర్ మధ్య సమన్వయం లేకపోవడంతో ఓట్ల బదిలీ జరగలేదన్నది మరొక వాదన. మొత్తం మీద తెలంగాణలోకాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి అనేక కారణాలతో పాటు కుంతియా కూడా ఒకరని గాంధీభవన్ టాక్.

Similar News