రాహుల్ ‘‘రాయల్’’ ఫార్ములా...!!!

Update: 2018-12-14 18:29 GMT

రాహుల్ గాంధీ కొత్త ఫార్ములా వర్క్ అవుట్ అవుతుందా? మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో గెలుపు కంటే ముఖ్యమంత్రి ఎంపికలోనే ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది రాహుల్ బాబు. ఎడతెగని చర్చలు... కార్యకర్తలతో యాప్ ద్వారా అభిప్రాయ సేకరణ ఇలా రాహుల్ అన్ని విధాలుగా సీఎం అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరించారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాహుల్ ఒక చోట ఒకలా..మరొకచోట మరోలా నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేసిన రాహుల్, రాజస్థాన్ విషయానికి వచ్చేసరికి ఆ సూత్రాన్ని పక్కన పెట్టేశారు. ఇక్కడ సీనియర్ కే అవకాశం కల్పించారు.

రెండు వర్గాలకూ....

మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా వేగంగా ప్రకటించిన రాహుల్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో చాలా టైమ్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థికి పోటీ పడుతున్న సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ లతో నిరంతరాయంగా చర్చలు జరిపారు. మరోవైపు రెండు వర్గాలు తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఒక కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో.....

సచిన్ పైలెట్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంలో తొలుత అశోక్ గెహ్లెట్ అభ్యంతరాలు వ్యక్తం చేశారట. ఏదైనా ఒకరి నాయకత్వంలోనే వెళితే రాష్ట్రం ముందుకు వెళుతుందన్నది గెహ్లాట్ అభిప్రాయం. మరో పవర్ సెంటర్ ఉండకూడదని ఆయన అభిప్రాయం కావచ్చు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఆరోవేలని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చెప్పి రాహుల్ గెహ్లాట్ కు నచ్చ చెప్పగలిగారు. అనుభవం, నవతరం కలిస్తే రాష్ట్రాభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని రాహుల్ చెప్పడంతో గెహ్లాట్ ఈ ప్రతిపాదనకు అంగీకరించారని తెలుస్తోంది.

చెరి సగం.....

అలాగే రెండు వర్గాల్లో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా రాహుల్ జాగ్రత్త పడ్డారు. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రిగా సచిన్ పైలెట్ ప్రమాణస్వీకారంచేసిన తర్వాత మంత్రి వర్గంలోనూ ఇరు వర్గాలకూ స్థానం ఉండాలన్నది రాహుల్ అభిప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెండు వర్గాలకూ చెరి సగం మంత్రి పదవులు దక్కేలా ఒక ఫార్ములాను రాహుల్ స్వయంగా రూపొందించారు. దీంతో రెండు వర్గాలు ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేసుకునేందుకు రాష్ట్రానికి బయలుదేరి వెళ్లాయంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రుల్లో మార్పు ఉండవచ్చన్న టాక్ పార్టీలోనూ, ఢిల్లీలోనూ బలంగా విన్పిస్తుంది.

Similar News