రాహుల్ కు అంతా క్లియర్ అయినట్లేనా?

Update: 2018-12-14 17:30 GMT

రాహుల్ గాంధీ నాయకత్వంపై క్రమంగా నమ్మకం పెరుగుతోంది. మోదీని ఎదుర్కొనే శక్తి రాహుల్ కు లేదని ఇప్పటి వరకూ భావించిన పార్టీలు సయితం రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా రాహుల్ ఒంటిచేత్తో ప్రచారం చేసి మోదీకి సొంత రాష్ట్రంలోనే చుక్కలు చూపించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గోవాలో అధికారంలోకి రావాల్సి ఉన్నా రాలేకపోయామని, కర్ణాటకలో అధికారాన్ని సాధించామని చెబుతున్నారు. ఇప్పుడు మూడు రాష్ట్రాలు కాంగ్రెస్ పరం కావడంతో రాహుల్ నాయకత్వ పటిమ ఏంటో తెలిసిపోయిందని పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.

కష్టకాలంలో పదవి చేపట్టి.....

రాహుల్ గాంధీ కష్టకాలంలో ఏఐసీసీ బాధ్యతలను స్వీకరించారు. తల్లి సోనియాగాంధీ అనారోగ్యంగా ఉండటం, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు వరుస పరాజయాలు రావడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు తిరిగి ప్రాణం పోశాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలను దక్కించుకోవడం ఆషామాషీ కాదంటున్నారు. మోదీపై వ్యతిరేకత, రాహుల్ పై ఉన్న నమ్మకమే ఈ రాష్ట్రాల్లో హస్తం పార్టీ విజయానికి కారణాలన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి.

రూట్ క్లియర్.....

దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలకు రాహుల్ గాంధీకి రూట్ క్లియర్ అయిందంటున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ అక్కడ కాంగ్రెస్ తో జట్టుకట్టలేదు. అయినా హస్తం పార్టీకి విజయం లభించడంతో రాహుల్ లీడర్ షిప్ కు ఓటర్లు జైకొట్టినట్లేనన్న భావన పార్టీ అగ్రనేతల్లోనూ కన్పిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూటమితో వెళ్లినా రాహుల్ ప్రధానమంత్రి పదవికి అర్హత ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో సాధించేసినట్లేనని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం.

కూటమి నేతల్లోనూ.......

అయితే దీనిపై కూటమిలో ఉన్న మిగిలిన పక్షాల్లో కూడా ప్రధానంగా ఈ చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ యేతర కూటమి విజయం సాధిస్తే మాయావతి, మమత బెనర్జీ వంటి నేతలు ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఛాన్స్ వస్తే శరద్ పవార్ కూడా అవకాశాన్ని వదులుకోనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలతో రాహుల్ కు ఎదురులేకుండా పోయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద రాహుల్ గాంధీ నాయకత్వం పై నమ్మకం పెరగడమే కాక, సీఎం అభ్యర్థుల ఎంపికలో కూడా సీనియర్లకు గౌరవమిస్తున్నారన్న టాక్ పార్టీలో బలంగా ఉంది.

Similar News