రాహుల్ రెడీ... మోడీ ఢీ....!!

Update: 2018-12-19 18:29 GMT

మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లను గెలిచిన ఊపు మీదున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇదే ఊపును 2019 సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు. రాఫెల్ కుంభకోణంపై ఇప్పటి వరకూ విమర్శలు చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు దానిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పుతో రాఫెల్ కంటే జీఎస్టీ, నోట్ల రద్దు విషయాన్ని లోక్ సభ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలనుకుంుటన్నారు. మరోవైపు మోదీ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు, రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

మూడు రాష్ట్రాల్లో.....

ఇటీవల కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో రైతాంగానికి రుణ మాఫీ చేసేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తొలిసంతకం ఆ ఫైలుపైనే పెట్టారు. రాజస్థాన్ ది కూడా అదే బాట. ఇక ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. రాహుల్ చెప్పినట్లుగా అధికారంలోకి వచ్చిన పదిరోజుల్లోగా రుణమాఫీ చేస్తామని ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా స్పష్టం చేశారు. ఛత్తీస్ ఘడ్ లో దాదాపు 6,100 కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన చెప్పడం విశేషం. ఇలా ఇటీవల కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో రుణమాఫీ చేసి రైతాంగానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని దేశవ్యాప్తంగా హస్తం పార్టీ సిగ్నల్స్ పంపనుంది.

మోదీని ఇరకాటంలో పెట్టేందుకు.....

దేశవ్యాప్తంగా కూడా రైతాంగానికి రుణమాఫీ చేయాలని మోదీ సర్కార్ పై రాహుల్ వత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ వల్ల కాకుంటే తాము అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా దేశ వ్యాప్తంగా రైతాంగానికి ఊరట కల్పిస్తూ రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించనున్నారు. దేశంలో అత్యధిక భాగమైన రైతాంగాన్ని ఆకట్టుకునేందుకు రాహుల్ ఈ ఎత్తుగడ వేశారు. మోదీ అమలు చేస్తే తమ డిమాండ్ వల్లనే జరిగిందని, అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో అది తమకు ప్రధాన అంశమవుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ప్రచారాస్త్రాలుగా.....

మూడు రాష్ట్రాల్లోనూ తమ విజయానికి ప్రధాన కారణం రైతాంగమేనని ఆ పార్టీ గుర్తిస్తోంది. దీంతోపాటు జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుపై కూడా పెద్దయెత్తున ప్రజల్లోకి తీసుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జీఎస్టీని ఇప్పటికే రాహుల్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ తో పోలుస్తున్నారు. జీఎస్టీ వల్ల మధ్యతరగతి, సాధారణ ప్రజలతో పాటు చిరు వ్యాపారులకు కూడా ఇబ్బందికరంగా మారిని నేపథ్యంలో దీనిని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకోనుంది హస్తం పార్టీ. అయితే ఎన్నికలకు ముందుగానే జీఎస్టీలో 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబ్ లోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష‌్టం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే మరిన్ని వరాలు ఇటు అధికార బీజేపీ నుంచి, మరిన్ని హామీలు విపక్ష కాంగ్రెస్ నుంచి వచ్చే అవకాశాలు మాత్రం పుష్కలంగా కన్పిస్తున్నాయి.

Similar News