రాహుల్ వల్ల అవుతుందా....?

Update: 2018-12-28 18:29 GMT

వరుస విజయాలతో తన నాయకత్వంపై నమ్మకం కలిగించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పెద్ద సవాల్ ముందుంది. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న రాహుల్ జైత్రయాత్రకు బ్రేకులు పడతాయా? గుజరాత్ లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో విజయం సాధించడంతో రాహుల్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. సీనియర్లు కూడా రాహుల్ లో నాయకత్వ పటిమ పెరిగిందన్నారు. ఎన్నికల వ్యూహాలను రచించడంలోనూ, ప్రచార శైలిలోనూ రాహుల్ దూకుడు వల్లనే విజయాలు లభించాయని గట్టిగా నమ్ముతున్నారు.

మిత్రులను కాపాడుకుంటారా?

అయితే సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తన మిత్రులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాహుల్ పై ఉంది. మిత్రపక్షాలు చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాహుల్ పై ఉంది. మోదీకి వ్యతిరేకంగా కూటమిని పటిష్టంగా ఏర్పాటు చేయడంలో రాహుల్ మాత్రమే చొరవ తీసుకోవాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ కూటమిలోకి రప్పించేందుకు ఆయన ఎలాంటి వ్యూహరచన చేస్తారన్నది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠగా మారింది.

యూపీలోనూ.....

ఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కూటమికి బీటలు వారకుండా రాహుల్ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

నేరుగా చర్చలు....

మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలవకపోవడానికి అక్కడి స్థానిక నేతలే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ వల్లనే మధ్యప్రదేశ్ లో పొత్తు కుదరలేదు. దీంతో రాహుల్ స్వయంగా రంగంలోకి దిగడం కాని, లేక సోనియా నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని రాహుల్ గాంధీకి పలువురు సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కర్ణాటకలోనూ జనతాదళ్ ఎస్ తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని చెబుతోంది. ఇలా అన్ని పార్టీలనూ మెప్పించి....ఒప్పించాల్సిన బాధ్యత రాహుల్ పైనే ఉంది. ఇందులో విజయవంతమైతే...లోక్ సభ ఎన్నికల్లో యాభై శాతం సక్సెస్ అయినట్లేనన్నది విశ్లేషకుల అంచనా.

Similar News