అక్కడ ఒకలా...ఇక్కడ మరోలా....??

Update: 2018-12-18 18:29 GMT

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అనుభవాన్ని గుర్తించిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఛత్తీస్ ఘడ్ వద్దకు వచ్చేసరికి వయసును చూసినట్లుంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా భూపేష్ భగల్ ను ఎంపిక చేయడం వెనుక రాహుల్ చతురతను ప్రదర్శించినట్లు చెబుతున్నారు. ఛత్తీస్ ఘడ్ సీఎం పదవికి సీనియర్ నేతలు టీపీసింగ్ దేవ్, చరణ్ దాస్ మహంత్, తమరాధ్ వాజ్ సాహులు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో టీపీ సింగ్ దేవ్ పేరు తొలిదశలో ప్రముఖంగా విన్పించింది. ఆయన సీనియారిటీ ఆయనను ముఖ్యమంత్రిని చేస్తుందని అందరూ భావించారు.

రెండు రాష్ట్రాల్లో....

రాజస్థాన్ లో సచిన్ పైలెట్ తొలినుంచి కష్టపడినా.. చివరకు సీనియర్ నేత, అశోక్ గెహ్లాట్ కు ముఖ్యమంత్రి పదవి వరించింది. సచిన్ పైలెట్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. అలాగే మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఎంతగానో కష్టపడినా చివరకు సీనియర్ నేత కమల్ నాధ్ కే ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇక్కడ సింధియా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వద్దని చెప్పేశారు. అయితే ఛత్తీస్ ఘడ్ లో మాత్రం సిీనియారిటీని పక్కన పెట్టి వయసులో తక్కువ వాడైన భూపేష్ భగల్ ను రాహుల్ ఎంపిక చేయడం విశేషం.

ఇక్కడ సీనియర్లున్నా.....

57 సంవత్సరాల వయస్సున్న భూపేష్ భగల్ 1986 నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు. యూత్ కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ లో ఆయన అనేక పదవులను దక్కించుకున్నారు. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పదిహేనేళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థిితి వచ్చింది. ఈ పదిహేనేళ్లు భూపేష్ భగల్ సహనంతో పార్టీని ముందుకు నడిపించారు. మరోవైపు టీపీ సింగ్ దేవ్ సీనియర్ నేత అయినా ఇక్కడ భూపేష్ పడిన కష్టాన్ని రాహుల్ గుర్తించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజలు ఎడతెరపని చర్చలు జరిపిన రాహుల్ చివరకు భూపేష్ కే ఓటేశారు.

కష్టం తెలిసిన వ్యక్తి కావడంతో.....

సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన భూపేష్ భగల్ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నేత. ఓబీసీల్లో గట్టి పట్టున్న నేత. రైతు కుటుంబం నుంచి రావడంతో ప్రజల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి అని రాహుల్ నమ్మారు. ఛత్తీస్ ఘడ్ లో మొత్తం 90 స్థానాలుండగా 68 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని తిరుగులేకుండా ఉంది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూపేష‌ భగల్ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం మీద రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో మాదిరి కాకుండా ఛత్తీస్ ఘడ్ లో విభిన్న నిర్ణయం తీసుకుని రాహుల్ భవిష‌్యత్ యువతదేనన్న సంకేతాలు పంపారు.

Similar News