రాహుల్ మనసులో చోటెవరికి...?

Update: 2018-12-06 05:00 GMT

ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? రాహుల్ మనసులో ఎవరున్నారు? ప్రజాకూటమికి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య హోరా హోరీ పోరు జరుగుతున్న సమయంలో ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం జరిగే సమయం వరకూ సీఎం అనే పదాన్ని ఎవరూ ఎత్తలేదు. ఎవరి పనుల్లో వారున్నారు. సీఎం అభ్యర్థులుగా పోటీ పడే వారు కూడా నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ గా మారడంతో వారు అక్కడికే పరిమితమయ్యారు. తమను ప్రచారకమిటీలో చోటు కల్పించలేదని గింజుకున్న నేతలు సయితం వారి నియోజకవర్గాల్లోనే ఉండిపోయారు.

జోరుగా పార్టీలో.....

ప్రచారం ముగియడంతో ఒకవేళ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ జరుగుతోంది. ప్రజాకూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం కొంత క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సీఎం అవుతారని చెప్పారు. కోదండరామ్ నేతృత్వంలో కమిటీ ప్రజాకూటమి ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేరస్తుందని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తాము సీఎం అభ్యర్థిని ఎన్నికల అనంతరమే నిర్ణయిస్తామని చెప్పారు. కూటమిలోని పార్టీ నేతలందరితో కూర్చుని చర్చించుకున్న తర్వాతనే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని చెప్పారు.

రేసులో అనేక మంది.....

దీంతో ఆశావహుల్లో మళ్లీ ఉత్సాహం కనపడుతోంది. ముఖ్యమంత్రి రేసులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు జానా రెడ్డి, డీకే అరుణ, మల్లు భట్టి విక్రమార్క వంటి నేతలున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనర్సింహ కూడా తాను రేసులో ఉన్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఇకఇటీవల పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కూడా తాను ఏం తక్కువ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే రాహుల్ ఓటు ఎవరికి? అన్న చర్చ పార్టీలో ప్రారంభమయింది. రాహుల్ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ఆయన శ్రద్ధ పెట్టిన తీరు చూస్తుంటే తెలంగాణ పార్టీపై స్పష్టమైన అవగాహన ఉందన్నది అర్థమవుతోంది.

ఉత్తమ్ ముందున్నారా.....?

అయితే పీసీసీీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ సంస్కృతి ప్రకారం సహజంగా పీసీసీ అధ్యక్షుడికే సీఎం పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది గతం. ఇప్పుడు రాహుల్ చెప్పినట్లే నడుస్తోది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎక్కడా రాహుల్ సీఎం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రతి రాష్ట్రంలో ఇద్దరు నుంచి ముగ్గురికి పైగా పోటీ పడుతున్నారు. అయితే ఉత్తమ్ గత నాలుగున్నరేళ్లుగా పడిన శ్రమ, చూపించిన చొరవ, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఆయనకే రాహుల్ టిక్ పెడతారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. అయితే ఇది ప్రజాకూటమి గెలిస్తేనే సాధ్యపడుతుంది. మరి రాహుల్ మనస్సులో ఎవరున్నారో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చి ప్రజాకూటమి విజయం సాధిస్తేనే సాధ్యమవుతుంది.

Similar News