జస్ట్ ఆస్కింగ్...? ప్రభావం లేదా?

Update: 2018-05-15 08:30 GMT

ప్రకాశ్ రాజ్.. విలక్షణ నటుడు. ఆయన స్వరాష్ట్రం కర్ణాటక అయినా వివిధ భాషల్లో తన నటనతో మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించారు. కొంతకాలం క్రితం వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టిన ఈ ఆర్టిస్టు ఇటీవల రాజకీయాలపై కన్నువేశారు. ఆయన ఏ పార్టీలోనూ చేరకున్నా, స్వంత పార్టీ పెట్టకున్నా బీజేపీని వ్యతిరేకించడమే అజెండాగా ముందుకుపోయారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీని ఓడించేందుకు తనవంతుగా ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి బీజేపీని ఓడించండి అంటూ కన్నడ ప్రజలకు పిలుపునిచ్చారు.

మోడీపై ప్రశ్నల బాణం.....

వాస్తవానికి గత సంత్సరం బెంగళూరులో జరిగిన పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాశ్ రాజ్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై, బీజేపీపై ప్రశ్నల బాణాలను ఇటీవల కాలంలో వదిలారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ అవలంబించిన విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని కూడా ప్రశ్నించారు. వీటికి వ్యతిరేకంగా అనేక సమావేశాల్లో మాట్లాడి ప్రజలకు తన వాదన వినింపించారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలాడే...

ప్రకాశ్ రాజ్ చెప్పులరిగేలా తిరిగినా, గొంతు పోయేలా మాట్లాడినా, కీబోర్డు పగిలేలా ట్వీట్లు చేసినా...పాపం కర్ణాటకలో బీజేపీని ఓడించాలనే తన ప్రయత్నాన్ని మాత్రం అక్కడి ప్రజలు పట్టించుకోలేదు. బీజేపీకి ఓటు వేయొద్దని, ఆ పార్టీ విధానాలతో దేశంలో అశాంతి నెలకొందని, ఇది ప్రజలకు ప్రమాదకరమని ఎంత చెప్పినా కూడా కన్నడ ప్రజలు బీజేపీ వైపే నిలిచారు. ప్రకాశ్ రాజ్ ప్రసంగాలను, వాదనలను కేవలం సినిమాల్లో చెప్పిన డైలాగులగానే పరిగణించారు. దీంతో చివరకు కన్నడ పొలిటికల్ స్క్రీన్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే మిగిలిపోయారు పాపం.

Similar News