జబ్బుపై గబ్బు రాజకీయమా?

కిట్స్ కొనుగోల విషయంలోనూ ఏపీలో రాజకీయం ఊపందుకుంది. ఏపీలో ప్రతి అంశమూ రాజకీయమే. ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని విపక్షాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక మీడియా కాచుక్కూర్చుంది. ఈ [more]

Update: 2020-04-19 06:30 GMT

కిట్స్ కొనుగోల విషయంలోనూ ఏపీలో రాజకీయం ఊపందుకుంది. ఏపీలో ప్రతి అంశమూ రాజకీయమే. ప్రతి అంశాన్ని ఉపయోగించుకోవాలని విపక్షాల నుంచి ప్రభుత్వ వ్యతిరేక మీడియా కాచుక్కూర్చుంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ కిట్స్ విషయంలోనూ పాలిటిక్స్ చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రభుత్వంపై కిట్స్ కొనుగోలులో గోల్ మాల్ జరిగిందన్న ప్రచారం హోరెత్తిపోతోంది.

దేశంలో నాలుగో స్థానంలో…..

కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుంది. పరీక్షలు నిర్వహించే రాష్ట్రాల్లో దేశంలో నాలుగో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. అయినా జగన్ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తెప్పించింది. ప్రత్యేక విమానంలో తెప్పించిన ఈ టెస్ట్ కిట్ల ద్వారా పది నిమిషాల్లో ఫలితం వస్తుంది. తద్వారా కరోనా నియంత్రణను వేగంగా అరికట్టవచ్చన్నది ఏపీ ప్రభుత్వం భావన. అందుకే దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను కొనుగోలు చేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

కిట్ల కొనుగోలులో…..

మరోవైపు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సయితం ఏపీ ప్రభుత్వం చేసిన పనికి ప్రశంసించారు. దక్షిణ కొరియా నుంచి టెస్ట్ కిట్స్ ను తెప్పించి ఏపీ మంచి పనిచేసిందని వెంకయ్యనాయుడు కొనియాడారు. అయితే టెస్ట్ ల కిట్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న ప్రచారం ఆగడం లేదు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ఒక్కో టెస్ట్ కిట్ ను రూ.337లకు కొనుగోలుచేసిందని, ఏపీ ప్రభుత్వం మాత్రం 1200 రూపాయలకు కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తప్పుడు ప్రచారంపై…..

కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం తాము రూ.1200లకు కొనుగోలు చేయలేదని చెబుతోంది. తాము ఏడు వందల రూపాయలకు కొనుగోలు చేశామని, ఇంకా ధరలపై చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ రాజకీయ పార్టీలు సయితం కరోనా కిట్ల కొనుగోలులో ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తి పడిందని విమర్శిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ బీజేపీ ఈ విమర్శలకు దిగింది. తాము ఇతర రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతనే కొనుగోలు చేశామని, తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కరోనా సమయంలోనూ గబ్బు రాజకీయాలేంటన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News