పీత‌లకు ఆ గండం లేనట్లేనా.....??

Update: 2018-12-21 15:30 GMT

పీత‌ల సుజాత‌. టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలిగా ఉన్న ఎస్సీ వ‌ర్గానికి చెందిన మ‌హిళా నాయ‌కురాలు. విద్యావంతురాలైన పీత‌ల‌కు టీడీపీలో మంచి ప‌లుకుబ‌డే ఉంది. 2004లోనే ఆమెకు చంద్ర‌బాబు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఆమెకు అనూహ్య‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో 2009లో సీటు కేటాయించ‌లేదు. అయినా కూడా ఎక్క‌డా నొచ్చుకోకుండా పార్టీకి అంకిత భావంతో ప‌నిచేస్తూ.. అధినేత చంద్ర‌బాబు ప‌ట్ల విధేయ‌త‌ను చూపిస్తూ వ‌చ్చారు. ఇదే ఆమెకు 2014లో బాగా క‌లిసి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో పీత‌ల‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నుంచి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఆమె త‌న సొంత నియోజక‌వ‌ర్గం కాక‌పోయినా అంద‌రినీ క‌లుపుకొని పోతూ... విజ‌యం సాధించారు.

మంత్రివర్గం నుంచి తొలగించినా....

దీంతో చంద్ర‌బాబు ఏకంగా పీత‌ల‌ను తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. మంత్రిగా కూడా పీత‌ల త‌న‌దైన ముద్రను వేసుకున్నారు. అయితే, 2017లో జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కొన్ని సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా పీత‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. నిజానికి ఈ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన ఒక‌రిద్ద‌రు అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. కొంద‌రు మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కూడా డుమ్మా కొట్టారు. కానీ, త‌న ప‌ద‌వి పోయినా ఎలాంటి చింతా లేకుండా అధినేత చంద్ర‌బాబు ఆశీస్సులే త‌న‌కు చాల‌ని భావించిన పీత‌ల‌.. ఎలాంటి అసంతృప్తీ లేకుండా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ పోరు లేకుండా త‌న పని తాను చేసుకు పోతున్నారు.

పీతలను మార్చాలంటూ...

ఇక‌, మ‌రో నాలుగు మాసాల్లోనే ఏపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. అయితే, ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌లువురు సిట్టింగు ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు మారుస్తార‌నే ప్ర‌చారం ఇటీవ‌ల కాలంలో బాగానే ఊపందుకుంది. ఈ క్ర‌మంలో పీత‌ల సుజాత‌ను కూడా మారుస్తారా ? అనే సందేహాలు భారీ ఎత్తున వ‌స్తున్నాయి. చింత‌ల‌పూడిలోని ఓ వ‌ర్గం సుజాత‌ను మార్చాల‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు రుస‌రుస‌లాడింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పార్టీ అధినేత చంద్ర‌బాబు, యువ‌నేత లోకేష్ ఆశీస్సులు పుష్క‌లంగా ఉండ‌డంతో పాటు పార్టీ ప‌ట్ల ఆమెకు ఉన్న విధేయ‌త‌తో చింత‌ల‌పూడి సీటు మ‌ళ్లీ ఆమెకే కేటాయిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఆ కోటాలో....

పార్టీపైనా.. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనా గ‌ట్టి ప‌ట్టు ఉండ‌డ మే కాకుండా నిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటున్న సుజాత‌కు టికెట్ గండం ఉండ‌ద‌ని చంద్ర‌బాబు చెప్పిన మాట పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఓ మ‌హిళగా ఈ రేంజ్‌లో క‌ష్ట‌ప‌డుతుండ‌డమే సుజాత‌కు ప్ల‌స్‌. అలాగే మాల‌, మ‌హిళా కోటాలో సుజాత టికెట్ ఖాయ‌మ‌ని వివ‌రిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి నుంచి సుజాత‌కు మార్చే ఛాన్సేలేద‌ని... అనుకోని స‌మీక‌ర‌ణ‌ల వ‌ల్ల ఆమెను చింత‌ల‌పూడి నుంచి మార్చినా జిల్లాలో మ‌రో రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గానికి మారుస్తార‌ని అంటున్నారు. మొత్తానికి సుజాత టిక్కెట్‌కు అయితే డోకా లేదు.

Similar News