కూటమి ఇక్కడైతే నెగ్గుతుందట....!!

Update: 2018-12-17 06:30 GMT

తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైనే పడింది. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి అట్టర్ ప్లాప్ అయింది. ఇక్కడ వన్ సైడ్ పోలింగ్ జరిగింది. తెలంగాణలో త్రిముఖ పోటీతో అధికార పార్టీకి లాభమని భావించిన విపక్షాలు అక్కడ మహాకూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తోంది. ఇక్కడ ఎక్కువ స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ లు బలంగా ఉన్నాయి. ఆ రెండింటిని ఢీకొట్టాలంటే ఇక్కడ కూటమి ఖచ్చితంగా ఏర్పడాలంటున్నారు. ఇటు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేక ఓట్లను చీల్చడమే కాకుండా, విపక్షం పై ఉన్న అసహనంగా ఉన్న ఓటర్లను కూడా ఆకట్టుకోవాల్సి ఉంటుంది.

జనసేన లీడ్ రోల్ లో.....

తెలంగాణలో కూటమి ఫెయిలయినా ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అవుతుంది అంటున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి గత ఆరు నెలలుగా జనంలోకి వెళుతున్నారు.పోరాట యాత్రల పేరిట ఆయన జనానికి చేరువవుతున్నారు. జనసేనలోకి చేరికలు కూడా బాగానే కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఇంకా పార్టీ బలం పడలేదన్నదే మైనస్ పాయింట్. టీడీపీ, వైసీపీలకు పోలింగ్ బూత్ ల వారీగా బలమైన క్యాడర్ ఉంది. నేతలున్నారు. కానీ జనసేనకు ఇంకా ఆ పట్టు చిక్కలేదు.

చిన్నాచితకా పార్టీలతో.....

దీంతో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడానికి అంతా రంగం సిద్ధమయింది. జనసేన, సీపీఐ, సీపీఎంలతో పాటు లోక్ సత్తాలో చేరిన జెడి లక్ష్మీనారాయణలతో కలసి కూటమిని ఏర్పాటు చేయాలని గట్టిగా భావిస్తున్నారు. తెలంగాణాలో వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు వేరుకుంపట్లు పెట్టుకున్నాయి. సీపీఐ మహాకూటమిలో ఉండగా, సీపీఎం బీఎల్ఎఫ్ పేరిట ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఏపీలో మాత్రం లెఫ్ట్ పార్టీలు కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాయి. సీపీఐ, సీపీఎంలకు గ్రౌండ్ లెవల్లో క్యాడర్ ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పనికి వస్తుందని పవన్ భావిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి నలభై నుంచి యాభై స్థానాలు సాధించి అధికారాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా మారతామని పవన్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

తొలిదశ పర్యటన తర్వాత....

అందుకే పవన్ తాను రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పర్యటించిన తర్వాత కూటమి ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న పవన్ రాగానే లెఫ్ట్ పార్టీ నేతలతో ఈ విషయంపై చర్చిస్తారని తెలిసింది. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. యువతను తమవైపు తిప్పుకుంటే భారీగా అధికార, విపక్ష పార్టీల ఓట్లకు గండికొట్టవచ్చన్న యోచనలో ఉన్నారు. ఏపీలో కూటమి గ్యారంటీగా వర్క్ అవుట్ అవుతుందన్న ధీమాలో పవన్ ఉన్నారు. తెలంగాణాలో క్యాలిక్యులేషన్ వేరని, ఆంధ్రాలెక్కలు వేరని జనసేన ముఖ్యనేత అనడం కొసమెరుపు.

Similar News