పవన్ ను ఆ ప్రాబ్లం వదిలిపెట్టదా...?

Update: 2018-12-29 06:30 GMT

రాజకీయ పార్టీ నడపాలంటే అంత ఈజీ కాదు. మామూలు రాజకీయ నేత వేరు... స్టార్ డమ్ ఉన్న పొలిటీషియన్ వేరు. ఈ తరహా నేతలు పార్టీని నడపాలంటే ఆషామాషీ కాదు. ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. కొత్త పార్టీ కావడంతో పునాదుల నుంచి అన్నీ తామే నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అవే ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగున్నరేళ్ల క్రితం పార్టీ స్థాపించినా నాలుగైదు నెలల నుంచే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో అయిన ఖర్చు చూసి ఆయనే నివ్వెరపోయే పరిస్థితి ఉంది.

అడుగుపెడితే లక్షలే....

పవన్ బయట అడుగుపెట్టాలన్నా.. పోరాటయాత్రచేయాలన్నా... జిల్లా పర్యటనలకు వెళ్లాలన్నా లక్షల్లో ఖర్చుపెట్టక తప్పదు. ఈ ఏడాది జనవరి నుంచి అమరావతి నుంచే పార్టీ కార్యకలాపాలుంటాయని పవన్ ప్రకటించారు. ఇప్పటికే జనసేన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్నారు. తనకు, సిబ్బంది, ముఖ్య నేతలు ఉండేందుకు ఫ్లాట్స్ రెంట్ కు తీసుకున్నారు. మరో ఐదు నెలల పాటు విస్తృతంగా పదమూడు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలకు ఖర్చు కోట్లలోనే ఖర్చవుతుంది.

ఎవరినీ చేయి చాచకుండా.....

జనసేన పార్టీ పెట్టినా పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఎవరినీ విరాళాల కోసం అడగలేదు. తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని, సన్నిహితులు, స్నేహితులు అందిస్తున్న సహకారంతో ఇప్పటి వరకూ పార్టీని నెట్టుకొస్తున్నారు. అయితే రానున్న ఐదు నెలలు ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొనాలని పవన్ కు తెలియంది కాదు. అందుకే విరాళాలను సేకరించాలని పవన్ భావిస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పార్టీ నేతలు విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. తన తల్లి అంజనా దేవి ఇచ్చిన తొలి విరాళంతోనే ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విరాళాల సేకరణకు....

జనసేన పార్టీకి చెందిన శతఘ్ని బృందం ద్వారా విరాళాల సేకరణకు నడుంబిగించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా జనసేనకు విరాళాలివ్వాలని ఈ టీం కోరుతోంది. పవన్ వివిధ సభల్లో మాట్లాడిన డైలాగ్ లు పోస్ట్ చేసి వాటికింద జనసేనకు విరాళాలివ్వాలని కోరుతుండటం విశేషం. దీంతో పాటు విరాళాల సేకరణ బాధ్యతను కొందరు ముఖ్యులకు పవన్ అప్పగించారు. వారు వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లి పార్టీ ఫండ్ ను సేకరించాల్సి ఉంటుంది. ఈ ఐదు నెలలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెనకబడిపోయామన్న అపవాదు రాకుండా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన విరాళాలను పారదర్శకంగా బయటకు చెప్పాలని, వాటిని సక్రమంగా ఉపయోగించుకునేలా చూడాల్సిన బాధ్యతను కొందరు ముఖ్యులపై పవన్ ఉంచారు. మొత్తం మీద పవన్ కల్యాణ్ కు పార్టీ నడపడమంటే ఏంటో ఇప్పటికి తెలిసి వచ్చింది.

Similar News