ఇక అయినట్లే....!!

Update: 2018-12-22 18:29 GMT

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి ఇంటిపోరు ఎక్కువయింది. ఒకవైపు పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న పన్నీర్ సెల్వానికి ఇది మింగుడుపడని సమస్యే. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు పైకి సఖ్యత గా కన్పిస్తున్నా వారి మధ్య అంతరం ఉందనేది అందరికీ తెలిసిందే. పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట పెట్టుకుని శాసిస్తున్న పళనిని పడగొట్టేందుకు ఆయన కసిగా సమయం కోసం వేచి చూస్తున్నారన్నది వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వం మద్దతు పళనికి పూర్తి స్థాయిలో ఉండటంతో పన్నీర్ ఏమీ చేయలేకపోతున్నారు.

సీట్లు సాధిస్తేనే.....

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు సాధిస్తేనే ప్రభుత్వ మనుగడ ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పళని ఇంటిబాట పట్టడం ఖాయం. తిరిగి బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వస్తే గుడ్డిలో మెల్లగా కొంతకాలం పరిపాలన చేయవచ్చు. అందుకే బీజేపీతో కొంత సఖ్యతతో ఉంటున్నారు. జయలలిత బతికున్నప్పుడు రెండు సార్లు తనను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని పన్నీర్ సెల్వం పదే పదే గుర్తు చేస్తూ వస్తున్నారు. అమ్మకు తనపై ఉన్న నమ్మకాన్ని కార్యకర్తల సమావేశంలోనూ వెళ్లగక్కుతున్నారు.

పన్నీర్ సోదరుడి ఉదంతంతో.....

ఈ సమయంలో పన్నీర్ సెల్వానికి ఇంటిపోరు తలెత్తింది. ఆయన సోదరుడు ఓ రాజా పన్నీర్ పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన ఇటీవల దినకరన్ వర్గానికి చేరువవుతున్నారన్న సమాచారం పక్కాగా ఉంది. పాల సంఘాల ఎన్నికల్లో పన్నీర్ సోదరుడు రాజా పోటీ చేయడం వెనక దినకరన్ ఎత్తుగడ ఉందంటున్నారు. రాజా కూడా పన్నీర్ తనను కాకుండా ఆయన కుమారుడిని ప్రోత్సహిస్తుండటంతో కొంత అసంతృప్తికి గురై దినకరన్ వద్దకు చేరారన్న టాక్ పార్టీలోనూ బలంగా విన్పిస్తోంది.

గతంలో పన్నీర్ పైనా.....

ఈ నేపథ్యంలో పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న పన్నీర్ సెల్వానికి సోదరుడు ఆటంకంగా మారారు. దీంతో సోదరుడిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పటికే ఒకసారి పన్నీర్ సెల్వం దినకరన్ తో సమావేశమయ్యారన్న ప్రచారం జరగడంతో కొంత అనుమానాలు పళనిస్వామి వర్గంలో బయలుదేరాయి. దీనిని నిజం చేస్తూ పన్నీర్ సోదరుడు దినకరన్ కు దగ్గరవ్వడంతో పళని, పన్నీర్ ల మధ్య మరింత దూరం పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి అదేజరిగితే లోక్ సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే గట్టెక్కడం కష్టమేనన్నది పరిశీలకుల భావన. ఒకవైపు స్టాలిన్ బలపడుతుండటం, వీరి మధ్య విభేదాలు పెరుగుతుండటం పార్టీ నేతల్లో ఆందోళనకు గురి చేస్తోంది.

Similar News