లోకేష్ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా...??

Update: 2018-12-08 09:30 GMT

రాజ‌కీయ చైత‌న్యం ఉన్న జిల్లా నెల్లూరులో టీడీపీ ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ నాయ‌కులు ఎప్ప‌టికి దారికి వ‌స్తారు? మ‌రో నాలుగు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి కదా.. ఎప్పుడు ఇక్క‌డ ప‌రిస్థితి చ‌క్క‌బ‌డుతుంది? టీడీపీ అభిమానులు ప్ర‌తి ఒక్క‌రూ ఎదురు చూస్తున్న విష‌యం ఇది. ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నా.. జిల్లాలో మాత్రం టీడీపీకి అనుకూల ప‌వ‌నాలు మాత్రం వీచ‌డం లేదు. దీంతో ఇక్క‌డ ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేసుకుంటూ.. పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనిని చ‌క్క‌దిద్దేందుకు ఇటీవ‌ల ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే, ఆయ‌న కూడా ఇక్క‌డ ప‌రిస్థితులను చ‌క్క‌దిద్ద‌లేక పోతున్నారు. అదే స‌మ‌యంలో సీనియ‌ర్ నాయ‌కుడు బొల్లినేనిని రంగంలోకి తెచ్చినా కూడా కొన్నాళ్లు ఫ‌ర్వాలేద‌ని అనిపించినా.. ప‌రిస్థితి మాత్రం మ‌ళ్లీ మామూలే అయింది.

లోకేష్ తీసుకున్నారా....?

దీంతో ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చాయి. దీంతో ఇక్క‌డి రాజ‌కీయాల‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి లోకేష్ తీసుకున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. జిల్లా టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగా పార్టీ బలహీన పడుతోందన్న సత్యాన్ని గ్రహించిన నారా లోకేష్‌ నెల్లూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రను అమరావతికి పిలిపించుకొని ఇటీవ‌ల ఆయ‌న ఆరా తీశారు. నియోజకవర్గాల వారిగా పార్టీ స్థితిగతులపై బీద నుంచి సమాచారం సేకరించారు. అభ్యర్థులు, ఆశావహులు వారి బలాబలాలు, జిల్లాలో అగ్రనేతల మధ్య ఆధిపత్యపోరులు, దానివల్ల జరుగుతున్న నష్టం, పార్టీకి పనిచేసి ఇప్పటికి వరకు ప్రయోజనం పొందని నేతల జాబితా తదితర వివరాలతో పాటు పార్టీ బలోపేతానికి ఏమి చేస్తే బాగుంటుంది తదితర విషయాలపై బీదతో నారా లోకేష్‌ సమగ్రంగా చర్చించారు.

సీట్ల విషయంలో క్లారిటీఇచ్చారా?

ఈ క్రమంలోనే లోకేష్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తలెత్తిన అనవసర రాద్దాంతానికి తెరదించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును పిలిపించుకొని టిక్కెట్టు విషయం క్లారిటీ ఇస్తూనే, ఏమి చేయాలో, ప్రజలతో ఎలా వ్యవహరించా లో కూడా దిశానిర్దేశం చేసిపంపారు. మిగిలిన ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే పార్టీ కోసం శ్రమించిన వారికి నామినేటెడ్‌ పదవులు వరించనున్నాయ‌ని తెలుస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా అసంతృప్తితో ఉన్న నాయకులను పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు జ‌రుగుతాయ‌ని స‌మాచారం. ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కొత్త శక్తులను సమీక రించుకునే ప్రయత్నాలు ఊపందుకోను న్నాయి.

మూడుచోట్లా తీవ్ర వ్యతిరేకతే....

అయితే వాస్త‌వంగా చూస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ గెలిచిన మూడు స్థానాల్లోనూ స్వ‌ల్ప తేడాతోనే గెలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. తిరిగి అక్క‌డ వారికే సీట్లు ఇస్తే వారు ఎంత వ‌ర‌కు గెలుస్తార‌న్న ప్ర‌శ్న‌లు కూడా సొంత పార్టీ కేడ‌ర్‌లోనే ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక పార్టీ ఓడిపోయిన ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితులు మెరుగు ప‌డ‌డం లేదు. ఈ టైంలో జిల్లా ముఖ్య నేతల మధ్య ఐక్యత, జిల్లాపై లోకేష్‌ ప్రత్యేకంగా దృష్టి సారించడం వంటి ప‌రిణామాల‌తో నెల్లూరుపై లోకేష్ ప్రారంభించిన ఆప‌రేష‌న్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News