పొలిటికల్ స్క్రీన్ పై ఎన్ఆర్ఐల ఫ్యూచర్ ఏంటో..?

Update: 2018-12-10 02:30 GMT

విదేశాల్లో స్థిరపడ్డా ఎన్ఆర్ఐలకు మాతృభూమిపై ఎనలేని మమకారం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడి రాజకీయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. ఆ మాటకొస్తే రాష్ట్రంలో ఉండేవారి కంటే కూడా ఎక్కువగా కొందరు ఎన్ఆర్ఐలకు రాజకీయాలపై అవగాహన ఉంటుంది. ఇక, అవకాశం దొరికితే స్వంత రాష్ట్రంలో ప్రజా ప్రతినిధిగా ఎన్నికవ్వాలని చాలామంది ఎన్ఆర్ఐలే కలలు కంటారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు స్వంత రాష్ట్రాల్లో రాజకీయ రంగప్రవేశం చేసి అదృష్టం పరీక్షించుకున్నారు. కొందరు గెలిచి ఇక్కడే స్థిరపడిపోగా... మరికొందరు ఓటమి పాలయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చాలా ఆసక్తి చూపే ఎన్ఆర్ఐ లు వారు నివసిస్తున్న దేశాల్లోనే ఇక్కడి పార్టీలకు అనుబంధంగా శాఖలు కూడా ప్రారంభించి యాక్టీవ్ గా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ కు చాలా దేశాల్లో శాఖాలు, వాటికి కమిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ కి కూడా ఓవర్సీస్ కాంగ్రెస్ ఉంది. సోషల్ మీడియా ప్రభావం పెరిగాక రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఎన్ఆర్ఐలు ఎప్పటికప్పుడు వారి విశ్లేషణలు, అభిప్రాయాలను ఇక్కడి వారితో పంచుకుంటున్నారు.

బరిలో ముగ్గురు ఎన్ఆర్ఐలు

ఈ ఎన్నికల్లోనూ చాలా మంది ఎన్ఆర్ఐలు వివిధ పార్టీల నుంచి టిక్కెట్లు ఆశించారు. టీఆర్ఎస్ సిట్టింగులకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్కరికి మినహా ఎవరికీ అవకాశం ఇవ్వలేకపోయింది. ఇక కాంగ్రెస్ తరపున చాలామంది ఎన్ఆర్ఐ లు టిక్కెట్లు ఆశించగా ఆ పార్టీ కూడా సీనియర్ల వైపే మొగ్గు చూపడంతో ఎవరికీ అవకాశం దక్కలేదు. అయితే, తెలంగాణ జన సమితి మాత్రం వారు పోటీ చేసే ఎనిమిది స్థానాల్లో రెండు టిక్కెట్లు ఎన్ఆర్ఐలకు కేటాయించింది. మొత్తానికి టీఆర్ఎస్ తరపున ఒకరు, టీజేఎస్ తరపున ఒక ఎన్ఆర్ఐ ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. వీరితో పాటు వేములవాడ నుంచి టీఆర్ఎస్ తరపున ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చెన్నమనేని రమేశ్ మరోసారి బరిలో ఉన్నారు. ఆయన జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేసి వచ్చారు.

ఉత్తమ్ తో పోటీకి ‘సై’ అన్న సైదిరెడ్డి

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కీలక నియోజకవర్గం హుజూర్ నగర్ టిక్కెట్ ఎన్ఆర్ఐ శానంపూడి సైదిరెడ్డికి కేటాయించి టీఆర్ఎస్ పెద్ద ప్రయోగమే చేసింది. మంత్రి జగదీశ్ రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడ్డ సైదిరెడ్డి ఐటీ ఉద్యోగిగా లండన్, కెనెడాల్లో పనిచేశారు. తర్వాత కెనడాలో వ్యాపారం ప్రారంభించి స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం స్వస్థలం హుజూర్ నగర్ కి వచ్చారు. ‘సై’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇంతలో ఎన్నికలు రాగా హుజూర్ నగర్ టీఆర్ఎస్ టిక్కెట్ కోసం సైదిరెడ్డితో పాటు మరో ఎన్ఆర్ఐ అప్పిరెడ్డి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పోటీ పడ్డారు. చివరికి సైదిరెడ్డికి టిక్కెట్ వచ్చింది. అప్పటికే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేసిన సైదిరెడ్డి చివరి నిమిషంలో టిక్కెట్ దక్కించుకున్నా బాగా ప్రచారం నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన గట్టి పోటీ ఇచ్చారు.

వర్ధన్నపేటలో గట్టి పోటీ ఇచ్చిన దేవయ్య

తెలంగాణ జన సమితి నుంచి ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎన్ఆర్ఐలకు టిక్కెట్లు ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట స్థానానికి డా.పగిడిపాటి దేవయ్యకు టిక్కెట్ కేటాయిచారు. జిల్లాలోని చిన్న గ్రామానికి చెందిన ఆయన కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. అనంతరం అమెరికా వైద్యుడిగా స్థిరపడ్డారు. తర్వాత అక్కడే వ్యాపారాన్ని ప్రారంభించారు. హెల్త్ ఇన్యూరెన్స్ కంపెనీని స్థాపించగా ఆ సంస్థ ఫ్లోరిడాలో ప్రముఖ సంస్థగా అభివృద్ధి చెందింది. తర్వాత ఆయన స్వంత ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వరంగల్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి ఓడారు. ఈ ఎన్నికల్లో ఆయన వర్ధన్నపేట ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి బరిలో దిగారు. వాస్తవానికి వర్ధన్నపేటలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించింది. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి తిరుగులదనుకున్నారు. కానీ, దేవయ్య ఎంటర్ అయ్యాక పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. ఆయన ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. రూపాయి జీతంతో పనిచేస్తానని ఆయన ప్రజల్లోకి వెళ్లారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఆరూరి రమేశ్ కి గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

కొండను ఢీకొట్టిన భవానీరెడ్డి

ఇక తెలంగాణ జన సమితి నుంచి టీఆర్ఎస్ కంచుకోట అయిన సిద్ధిపేట బరిలో దిగారు మరికంటి భవానీరెడ్డి. ఆమె స్వస్థలం సిద్ధిపేట జిల్లా నాగిరెడ్డిపల్లి. సిద్ధిపేట, హైదరాబాద్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. కొంతకాలం ఆర్టీసీలో ఉద్యోగం చేసి తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి సిడ్నీలో స్థిరపడ్డారు. అక్కడ ఉద్యోగం చేసిన ఆమె తెలంగాణ జేఏసీ పిలుపుమేరకు ఆస్ట్రేలియాలో తెలంగాణ ఉద్యమ, సాంస్కృతిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. తర్వాత ఆమె తెలంగాణకు తిరిగి వచ్చి టీజేఎస్ లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె ఏకంగా కొండను ఢీకొడుతున్నారు. అర్థ, అంగ, ప్రజాబలం మెండుగా ఉన్న హరీష్ రావుపై సిద్ధిపేటలో ఆమె బరిలో ఉన్నారు. చాలా రోజులుగా భవానీరెడ్డి ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఆమె ప్రచారంలో చాలానే కష్టపడ్డారు కానీ పెద్దగా ఫలితం ఉండే అవకాశం అయితే లేదు. మరి ఏ మేర ఓట్లు సాధించి హరీష్ రావుకి పోటీ ఇస్తారో చూడాలి. మొత్తానికి ముగ్గురు ఎన్ఆర్ఐల రాజకీయ భవిష్యత్ 11న తేలనుంది.

Similar News