వాయిస్ లేకపోతే ఎలా....?

Update: 2018-12-12 00:30 GMT

శాసనసభలో విపక్షం వాయిస్ లేకుండా పోయింది. వన్ సైడ్ ఓటింగ్ తో ఇక అధికార పార్టీకి తిరుగులేకుండా పోయింది. జానారెడ్డి, రేవంత్ రెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలి వంటి నేతలు ఇప్పుడు శాసనసభలో లేరు. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి వారే ఉన్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి వారు కూడా గెలుపొందలేదు. శాసనసభలో విపక్ష వాయిస్ లేకుండా పోయింది. మామూలుగానే కేసీఆర్ ఎత్తులు, వ్యూహాలను ఎదుర్కొనాలంటే సాధారణ విషయం కాదు. అలాంటిది ఇప్పుడు శాసనసభలో సయితం అధికార పార్టీ వ్యవహారం ఏకపక్షంగా సాగుతుందనే చెప్పాలి.

గత శాసనసభలో.....

సాధారణంగా కేసీఆర్ తను అనుకున్నదే చేస్తారు. కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనలో విపక్షాల గొంతు నొక్కారన్నది వాస్తవం. చివరకు ధర్నా చౌక్ ను కూడా ఎత్తివేశారు. ఆందోళనకారుల నినాదాలు అసెంబ్లీ దరిదాపులకు కూడా రానివ్వలేదు. గత ఎన్నికల్లో 63 స్థానాలు సాధించిన కేసీఆర్ ఒంటెత్తు పోకడలు అవలంబించారన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. విపక్షాలు మహాకూటమి కట్టి అదే ప్రచారాస్త్రంగా వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి పూర్తి స్థాయి మెజారిటీతో దాదాపు 87 స్థానాలు గెలుచుకున్నారు. ఇక కేసీఆర్ ఎవరి మాట వింటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

మరోసారి సెంటిమెంట్ తో.....

అయితే గత ఎన్నికల్లో ఉద్యమ సెంటిమెంట్ తో వచ్చిన కేసీఆర్ మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవం నినాదంతో విజయ బావుటా ఎగుర వేశారు. విపక్షాలు గొంతునొక్కినా గత నాలుగున్నరేళ్లలో ప్రజాసంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారు. రైతు బందు పథకం, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, ఆసరా వంటి పథకాలను క్షేత్రస్థాయిలో బలంగా అమలు చేయగలిగారు. విపక్షాలకు చెందిన నియోజకవర్గాల్లోనూ ఈ పథకాలను వివక్ష లేకుండా అమలు పర్చారన్న ప్రశంసలను కేసీఆర్ అందుకున్నారు. అందుకే గతంలో కాంగ్రెస్ సిట్టింగ్ లందరూ దాదాపు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు.

మేధావుల ఆందోళన....

అయితే ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఈ ఎన్నికల ఫలితాలపై ఆందోళన చెందుతున్నారు. ఫలితాలు ఏకపక్షంగా రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటున్నారు. ప్రజారంజక పాలన ఉండాలంటే విపక్షం కూడా గట్టిగా ఉండాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈఎన్నికల్లో విజయం ఏకపక్షంగా సాగింది. వన్ సైడ్ పోలింగ్ జరిగింది. దీంతో 21 మంది గెలిచిన విపక్షం శాసనసభలో చేసేదేమీ లేదు. కేసీఆర్ కూడా విపక్షాల గొంతుకు అవకాశమివ్వాలని మేధావులు కోరుకుంటున్నారు. మరి శాసనసభలో వాయిస్ లేకపోయినా... నాయిస్ లేకుండా పాలన సాగించాలని కేసీఆర్ ను కోరుకుందాం..వేడుకుందాం....!!!

Similar News