ఫార్ములా మారదంటున్నారే....!!

Update: 2018-12-25 17:30 GMT

తలా ఒక దారి... మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవుతాయనుకుంటుంటే రోజురోజుకూ జరుగుతున్న పరిణామాలు కూటమికి చేటు తెచ్చేటట్లే కన్పిస్తున్నాయి. ఒకవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలలో సూపర్ సక్సెస్ అయిన ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకంచేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో నవీన్ పట్నాయక్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు సుముఖంగానే ఉన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తొలి నుంచి బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగానే ఆయన ఉన్నారు.

మమత వెనకడుగు వేశారా?

ఇక మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సయితం కేసీఆర్ ప్రతిపాదన పట్ల ఆమె సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. మమత బెనర్జీ కూడా కొంతకాలం నుంచి కాంగ్రెస్ కు దూరంగానే ఉండాలని భావిస్తున్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమత తొలినాళ్లలో కొంత కాంగ్రెస్ పట్ల సుముఖంగానే ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని ఆమె కొంత దూరం పాటించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తొలి నుంచి మమత బెనర్జీ ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. కానీ మోదీ నియంతృత్వ పోకడలతో ఆమె కాంగ్రెస్ కు సానుకూలంగా మారాల్సి వచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

బీఎస్పీ ఒంటరిగానే.....

ఇక కూటమిలో మరో పట్టున్న పార్టీ మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ కూడా ఎన్నికలకు ముందు కూటమికి నో అంటుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిల మధ్య లోక్ సభ ఎన్నికల పొత్తుల చర్చలు జరిగాయి. వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి బీఎస్పీ, ఎస్పీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ఇప్పటికే పొత్తులు కుదుర్చుకున్నాయంటున్నారు. జనవరి 15వ తేదీన జరిగే తన పుట్టిన రోజు సందర్భంగా యూపీలో పొత్తులపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందంటున్నారు.

మాయా మదిలో.....

ఇంతటితో ఆగకుండా మాయావతి పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించడం నిజంగా సంచలనమే. మద్యప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, మొత్తం 29 లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ఆ పార్టీ నేత రాంజీ గౌతమ్ ప్రకటించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తో జతకట్టకుండా మాయావతి ఒంటరిగానే బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరమే మధ్యప్రదేశ్ లో ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. ఇదే ఫార్ములాను తాము అనుసరిస్తామని మాయావతి చెప్పకనే చెప్పారు. అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి తమ పొలిటికల్ డెసిషన్ ఉంటుందంటున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుగానే కూటమి ఏర్పాటును కోరుకుంటుంటే... అందుకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు కాంగ్రెస్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Similar News