నితీష్ కు దారి కన్పించడం లేదా?

Update: 2018-12-16 18:29 GMT

బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యు అధినేత నితీష్ కుమార్ కు దారి కన్పించడం లేదు. భారతీయ జనతా పార్టీతో పొత్తుతో వచ్చే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలా? లేదా? ఒంటరిగా వెళ్లాలా? అన్న దానిపై నితీష్ పార్టీలో మేధోమధనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం పాలవ్వడంతో నితీష్ పునరాలోచనలో పడ్డారు. మామూలుగా వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతోనే కలసి వెళ్లాలని నితీష్ భావించారు. ఈమేరకు రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కూడా జరిగింది. అయితే తాజా రాజకీయ పరిణామాలతో నితీష్ పొత్తుపై వెనక్కు తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.

రామమందిరం నిర్మాణం.....

బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీల కూటమి బలంగా ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ విష‍యం స్పష్టమైంది. అయితే భారతీయ జనతా పార్టీ తాజాగా రామమందిరం నినాదం ఎత్తుకోవడం నితీష్ కు నచ్చడం లేదు. రామమందిరం నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలన్న ఆలోచన నితీష్ కు నిద్రలేనివ్వకుండా చేస్తుంది. బీజేపీ ఆర్డినెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తే తాము మద్దతిచ్చేది లేదని నితీష్ ఇప్పటికే స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాల మేరకే రామమందిరం నిర్మాణం చేయాలన్నది నితీష్ డిమాండ్.

బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటే....

మరోవైపు వచ్చే లోక్ సభ ఎన్నికలలో తిరిగి విజయకేతనం ఎగురవేసేందుకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రామమందిరంపై ముందడుగు వేయక తప్పని పరిస్థితి. దీనికి తోడు శివసేన, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు రామమందిరం నిర్మించాలన్న డిమాండ్ ను ఉధృతం చేస్తున్నాయి. దేశ రాజధానిలో వీహెచ్ పి ఇటీవల కవాతు చేయడం కూడా ఇందుకు అద్దం పడుతోంది. హిందూ ఓటర్లను ఆకట్టుకోవాలంటే రామమందిరం నిర్మాణ పనులు ఎన్నికల లోపే ప్రారంభించలన్న యోచనలో కమలం పార్టీ ఉంది.

ఒంటరిగానేనా?

ఈనేపథ్యంలో నితీష్ బీజేపీతో మైత్రిని కొనసాగిస్తారా...? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. నితీష్ బీహార్ లో మహా ఘట్ బంధన్ చేరే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నితీష్ రీ ఎంట్రీకి లాలూప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ ససేమిరా అంటుంది. దీంతో నితీష్ కాంగ్రెస్ తో కూడిన కూటమిలో చేరలేని పరిస్థితి ఉంది. రామమందిర నిర్మాణంపై బీజేపీ చర్యలు ప్రారంభిస్తే దానితో కలసి నడవలేని పరిస్థితి. మరి నితీష్ ఇప్పుడు ఏంచేస్తారు? ఒంటరిగానే వెళతారా? లేదా? అన్నది కొద్దికాలంలోనే తేలిపోనుంది.

Similar News