నవీన్ రూటే సపరేటు....!!

Update: 2018-12-07 17:30 GMT

దాదాపు 19 ఏళ్లుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి సపరేట్ దారిని ఎంచుకున్నారు. ఆయన ఎన్నికల వ్యూహాలను రచించడంలో దిట్ట. అందుకే ఆయనకు వరుస విజయాలు వరిస్తున్నాయన్నది ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తున్న విషయం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రత్యర్థి పార్టీకి సవాల్ విసురుతున్నారు. అత్యధిక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇది దేశవ్యాప్త అంశమే అయినా ఒడిశాలో నవీన్ ఉపయోగపడుతుందన్నది విశ్లేషకుల అంచనా.

బాబు, మమత బెనర్జీలు....

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీబీఐ, ఆర్బీఐ, ఈడీ వంటి సంస్థలు నిర్వీర్యమయ్యాయని, మోదీ చెప్పుచేతల్లో నడుస్తన్నాయని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. వీరికి ఫక్తు రాజకీయ ప్రయోజనాలేనన్నది విమర్శకుల మాట. బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి తమ రాష్ట్రాల్లో పార్టీకి విజయావకాశాలు మెరుగుపర్చుకోవాలన్న లక్ష్యంతో వీరు సాగుతున్నారని బీజేపీ సయితం విమర్శిస్తుంది.

నవీన్ మాత్రం....

అయితే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎంచుకున్నారు. శాసనసభలో మహిళలకు 33 శాతం స్థానాలు కేటయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఇది ఒక్క ఒడిశా రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా మహిళా రిజర్వషన్ల బల్లుపై అన్ని పార్టీలనూ ఏకం చేయాలని నవీన్ నిర్ణయించారు. ప్రస్తుతం పార్లమెంటులో పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు ఆమోదం తెలపాలంటూ అన్ని పార్టీలకూ ఆయన విజ్ఞప్తులు చేస్తున్నారు.

11 నుంచి చర్చలు షురూ....

ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పటికే లేఖ రాసిన నవీన్ మహిళా సాధికారతకు ముఖ్యమంత్రులంతా సహకరించాలని కోరుతున్నారు. ఇందుకోసం ఏడు జాతీయ పార్టీలు, పదిహేను ప్రాంతీయ పార్టీల వద్దకు నవీన్ తమ నేతల ద్వారా సందేశం పంపనున్నారు. ఇందుకోసం పార్టీల వారీగా మాట్లాడాల్సిన నేతల జాబితాను ఆయన రూపొందించారు. చంద్రబాబు, కె.చంద్రశేఖర్ రావులతో బిజూ జనతాదళ్ నేతలు సౌమ్యరంజన్, పట్నాయక్ లు మాట్లాడాలని నిర్ణయించారు. ఈనెల 11వ తేదీనుంచే అన్ని పార్టీల నేతలతో చర్చించాలని నిర్ణయించారు. మొత్తం మీద నవీన్ నయా ఎత్తుగడ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలనూ ఇరకాటంలోకి నెట్టే అవకాశముంది. తాను లబ్ది పొందే ఛాన్స్ ఉంది.

Similar News