మోదీ జట్టు నుంచి మరొకరు అవుట్..???

Update: 2018-12-07 16:30 GMT

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాల కూటమి ఐక్యత ఎంత కష్టమో... మోదీకి అండగా నిలబడిన వాళ్లు కూడా ఉండటం అంత సులువు కాదని అర్థమయిపోతోంది. మోదీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పటికే కొన్ని పార్టీలు ఎన్డీఏకు రాంరాం చెప్పేశాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో బలమైన తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పింది. దక్షిణాదిన కమలం పార్టీకి ఎటూ బలం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ వెళ్లినా ఎన్నికల అనంతరం మరో ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే వీలుంది. ఇక శివసేన కూడా ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది.

శివసేన దారికొస్తుందా?

అయితే శివసేన, బీజేపీలది ఒకేరకమైన జెండా, అజెండా కాబట్టి ఎన్నికల చివరి నిమిషంలో ఇద్దరికీ పొత్తు కుదిరే అవకాశముంది. ఇప్పటికే మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు ప్రకటించి బీజేపీ దూకుడుగా ఉంది. శివసేన కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వెనక పయనించాల్సి ఉంటుంది. లేకుంటే ఓట్ల చీలికతో రెండు పార్టీలు నష్టపోయే అవకాశముంది. దీంతోశివసేన అధినేత ఉద్ధవ్ ధాక్రే ఇటీవల అయోధ్య పర్యటన చేసి కొంత సెంటిమెంట్ ను రగిలించారు. చివరి నిమిషంలో శివసేన, బీజేపీ కలసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా.

బీహార్ లో గట్టిపోటీ.....

మరో వైపు ఉత్తర భారతంలో మరో ముఖ్యమైన బీహార్ రాష్ట్రంలోనూ ఎన్డీఏ లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీలు కలసి కూటమిగా ఏర్పడనున్నాయి. ఇక్కడ ఆర్జేడీ బలం బాగా పెరడగంతో ముఖ్యమంత్రి నితీష్ కు కూడా కొంత అసహనంగా ఉన్నారు. అందుకే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పార్టీలో ఉన్నత పదవి నిచ్చి పార్టీ విజయావకాశాలు మెరుగుపర్చుకోవాలని నితీష్ వ్యూహం రచించారు.

మరొకరు అవుట్.....?

మరోవైపు ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ మోదీ జట్టుకు త్వరలోనే గుడ్ బై చెప్పనుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత ఉపేంద్ర కుశ్వాహ స్పష‌్టమైన సంకేతాలు ఇచ్చారు. బీహార్ లో సీట్ల పంపకం దాదాపు ఖరారయింది. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ యు మధ్య అవగాహన కుదిరింది. లోక్ సమతా పార్టీకి రెండు స్థానాలు ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయితే ఇది తమను అవమానించడమేనని భావించి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ జట్టునుంచి తప్పుకోనుంది. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న కుశ్వాహా రాజీనామా చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి, ఎన్డీఏకు గుడ్ చై చెప్పనున్నారు. మరి మోదీ మిత్రులు ఒక్కొక్కరిగా తప్పుకుంటుండటంతో లోక్ సభ ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Similar News