ముంచినా....తేల్చినా....!!

Update: 2018-12-19 16:30 GMT

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలుపు అంత సులువు కాదన్నది స్పష‌్టంగా తెలుస్తోంది. 2014 ఎన్నికలలో ఉన్న వాతావరణం ఇప్పుడు దేశవ్యాప్తంగా కన్పించడం లేదన్నది విశ్లేషకుల అంచన. మోదీ చరిష్మా మసక బారిపోవడంతో ఈ నాలుగు నెలలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. నోటిఫికేషన్ వెలువడక ముందు మోదీ సర్కార్ తీసుకునే నిర్ణయాలే తమకు ప్రధాన బలం అన్నది కమలనాధులు సయితం అంగీకరిస్తున్నారు. మోదీ మ్యాజిక్ చేస్తారా? లేక 2004 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయా? అన్న ఆందోళనలో కమలం పార్టీ ఉందన్నది చెప్పక తప్పదు. అయితే రాహుల్ గాంధీ నాయకత్వంలో క్రమంగా కాంగ్రెస్ బలపడుతుండటంతో బీజేపీ ఆందోళనలో ఉంది.

ఇమేజ్ తగ్గిందా.....?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు బలాన్నిచ్చాయి. ప్రధానంగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు విష‍యంలో మోదీ సర్కార్ వేసిన రాంగ్ స్టెప్ దేశవ్యాప్తంగా కమలం పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయన్నది అర్థమైపోతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తే స్థానిక రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుతో పాటు మోదీ ఇమేజ్ తగ్గడం కూడా ఒక కారణమని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. 2004లో భారత్ వెలిగిపోతోంది అన్న నినాదంతో వాజ్ పేయి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు కమలనాధుల చేతుల్లో ఆ నినాదం కూడా లేకుండా పోయింది.

ఆయన్నే నమ్ముకుని......

మోదీ చరిష్మానే నమ్ముకుని వెళ్దామనుకుని నిన్న మొన్నటి వరకూ కమలనాధులు భావించారు. అయితే క్రమేపీ అది తగ్గిపోతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆ పార్టీ అన్వేషిస్తుంది. ఒకవైపు సర్కార్ ప్రజాకర్షణ పథకాలను ఈ నాలుగు నెలల్లో తీసుకురావడం ఒక వ్యూహం. అందులో భాగంగా రైతులు, మధ్యతరగతి, ఓబీసీ ఓటర్లను ఆకర్షించేందుకు పథకాలను తీసుకురావాలన్న యోచనలో ఆ పార్టీ అగ్రనేతలు ఉన్నారు. సంక్షేమ పథకాలతోనే గట్టెక్కాలన్నది వారి ఆలోచనగా కన్పిస్తోంది. దీంతోపాటు తాము తీసుకున్న నిర్ణయాలు ఇచ్చిన ఫలితాలను కూడా ప్రజల ముందుంచే ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నారు.

జై శ్రీరామ్ అంటేనే.....

ఇక ఫైనల్ గా హిందూ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా రామజన్మభూమిని మళ్లీ లేవెనెత్తడం. ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ లు రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని వత్తిడి తెస్తున్నారు. ఇది మతానికి సంబంధించింది కాదని, సంస్కృతి, విశ్వాసాల్లో భాగమని వారు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీల నుంచి కూడా రామమందిరం విషయంలో నిర్ణయం తీసుకోవాలని వత్తిడి ప్రారంభమయింది. దీనిపై ఆచితూచి అడుగులు వేయాలని సర్కార్ భావిస్తోంది. మొత్తం మీద ముంచినా...తేల్చినా మోదీయేనన్నది కమలం పార్టీలో విన్పిస్తున్న టాక్. నాలుగు నెలల సమయంలో మోదీ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Similar News