మోదీకి మంచి శకునములే....!!

Update: 2018-12-11 16:30 GMT

భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ భవిష్యత్ మాత్రం శుభసూచకంగా కనపడుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, తెలంగాణలో నేడు ఎన్నికల ఫలితాల అనంతరం కమలనాధుల్లో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందనే చెప్పాలి. మోదీ పట్ల, బీజేపీ పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఈ ఫలితాలు కొట్టి పారేశాయని కమలనాధులు భావిస్తున్నారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బీజేపీ అధికారంలో నిన్న మొన్నటి వరకూ కొనసాగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో ఆ పార్టీ అధికారంలో ఉండటంతో తిరిగి అక్కడ పవర్ లోకి రావాలని కమలనాధులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు.

ఈ ఫలితాలతో.....

బీజేపీ పని అయిపోయిందని చెబుతున్న వారికి ఈ ఎన్నికల ఫలితాలు కనువిప్పు కలిగిస్తాయని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం అద్దంపడుతుంది. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య వార్ నువ్వా? నేనా? అన్నట్లు సాగింది. మధ్యప్రదేశ్ లో వందకు పైగా స్థానాలు దక్కించి అక్కడ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తానేంటో నిరూపించుకున్నారు. దీంతో బీజేపీకి గాలి లేదన్న వాదనలను ఆ పార్టీ నేతలు కొట్టి పారేస్తున్నారు. బీజేపీకి మధ్యప్రదేశ్ లో బలమైన ఓటు బ్యాంకు ఉందన్న విషయం మరోసారి రుజువైందంటున్నారు.

రాజస్థాన్ లో వ్యతిరేకత ఉన్నా.....

రాజస్థాన్ లో ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందన్నది మొదటి నుంచి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని భావించారు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకున్నా అక్కడ బీజేపీ 70కు పైగా స్థానాలు సాధించి తమ పట్టు కోల్పోలేదని చెప్పకనే చెప్పింది. ఇంతటి వ్యతిరేకతలోనూ 70కి పైగా స్థానాలను సాధించడం సామాన్య విషయం కాదంటున్నారు. అలాగే తెలంగాణాలోనూ కాంగ్రెస్ తో కూడిన ప్రజాకూటమి ఓటమిపాలు కావడం, అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించడంతో బీజేపీకి సానుకూల అంశంగా చెబుతున్నారు.

లోక్ సభ ఎన్నికల నాటికి.....

ఈ ఎన్నికల తర్వాత లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు అంత సులువుగా లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో వచ్చే ఎన్నికల్లో తిరిగి తమ స్థానాలను తాము గెలుచుకుంటామన్న ధీమా కమలం పార్టీలో వ్యక్తమవుతోంది. తాము ఆశించిన దానికన్నా ఎక్కువ స్థానాలు సాధించామని, బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని కమలనాధులు పూర్తి సంతృప్తిలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమదే విజయం అన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. రాష్ట్రాల్లో ఓటమి పాలయినా లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంటామని ఆ పార్టీ నేతలు భరోసాగా ఉన్నారు.

Similar News