ఆ రెండింటిపైనే ఆశలు....!!

Update: 2018-12-08 17:30 GMT

మూడు దఫాలుగా అధికారంలో ఉన్న రాష్టాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టి పోటీనే ఇస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత లేకుండా, ముఖ్యమంత్రుల సమర్థత, పరిపాలన దక్షత కారణాల వల్లనే బీజేపీ ఆ రెండు రాష్ట్రాల్లో గెలిచినా గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 11వ తేదీన ఫలితలు వెలువడనున్నాయి. అయితే బీజేపీ ప్రధానంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో తిరిగి తన ఖాతాలో వేసుకునేందుకు శ్రమించింది.

రాజస్థాన్ చేజారినట్లేనా?

అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్ చేజారిపోతుందన్న అంచనాలు వచ్చాయి. ఇక్కడ హస్తం పార్టీ అధాకారాన్ని కైవసం చేసుకుంటుందని గట్టి అంచనాలు విన్పిస్తున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే పై ఉన్న వ్యతిరేకత తమకు సానుకూలంగా మారిందని కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా చెబుతుంది. సంప్రదాయం కొనసాగతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత వచ్చిన ప్రతి సర్వే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో 200 అసెంబ్లీ స్థానాలుండగా వందకు పైగా స్థానాలు తమవేనన్న ధీమా హస్తం పార్టీలో కన్పిస్తుంది. బీజేపీ కూడా దాదాపు రాజస్థాన్ పై ఆశలు వదిలేసుకుంది.

హోరాహోరీ అయినా.....

ఇక మధ్యప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరీగా జరిగిందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కు తాము సులువుగా చేరుకుంటామని కమలం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో దాదపు అన్ని జాతీయ మీడియా సంస్థలు నెక్ టు నెక్ ఉందని తేల్చి చెప్పాయి. దీంతో కమలం పార్టీ ఖచ్చితంగా తామే అధికారాన్ని మరోసారి కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ పై చివరి నిమిషంలో సానుభూతి పెల్లుబుకడంతో ప్రభుత్వ వ్యతిరేకత అంటూ ఏమీ లేదని బీజేపీ చెబుతోంది. అయితే కాంగ్రెస్ కూడా మధ్యప్రదేశ్ లో ఖచ్చితంగా గెలుస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేయడం విశేషం.

పూర్తి మెజారిటీతో....

ఇక 90 స్థానాలున్న ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ తిరుగులేని మెజారిటీతో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. రమణ్ సింగ్ పై ప్రజల నమ్మకం తిరుగులేనిదంటున్నారు. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు. బీఎస్సీ, ఛత్తీస్ ఘడ్ జనతా కాంగ్రెస్ లు పోటీ చేయడంతో తమకు కలసి వచ్చే అంశంగా కమలనాధులు చెబుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం రెండు పార్టీలకూ సరిసమానంగానే స్థానాలు వచ్చాయి. అజిత్ జోగి, బీఎస్పీ పార్టీలకు ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రావడంతో వారు కూడా కీలకంగా మారే అవకాశముందంటున్నారు. మొత్తం మీద ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో రెండు రాష్ట్రాలను తమ ఖాతాలో వేసుకునేది ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తుండటం విశేషం.

Similar News