టార్గెట్ చంద్రబాబు..మోదీది అదే మంత్రమా...?

Update: 2018-12-22 00:30 GMT

ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. వచ్చే నెల 6వ తేదీన గుంటూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత తొలిసారి ఏపీలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ ప్రసంగం పైనే అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఏం మాట్లాడతారు..? చంద్రబాబును టార్గెట్ చేస్తారా? ఏపీ విభజన హామీల విషయంపై ఏం చెప్పనున్నారు? నాలుగున్నరేళ్లుగా ఏపీ ప్రజలు ఆశలుపెట్టుకున్న ప్రత్యేక హోదాపై ఏం మాట్లాడతారన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది.

వచ్చే నెలలో గుంటూరుకు....

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నరేంద్రమోదీని ఏపీకి తీసుకొస్తున్నారు భారతీయ జనతాపార్టీ నేతలు. ఏపీలో ఒక నెల తేడాలోనే రెండు సభలను నరేంద్రమోదీతో నిర్వహించాలని ఏపీ బీజేపీ నేతలు నిర్ణయించారు. జనవరి ఆరోతేదీన గుంటూరు సభ తర్వాత రాయలసీమలో మరో సభను ఏర్పాటు చేయాలన్నది వారి ఆలోచన. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలింది. ఒక్కసీటుతో తెలంగాణలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీలో బీజేపీని చంద్రబాబు ఇప్పటికే విలన్ ను చేసేశారు. గత ఏడాదినుంచి ధర్మపోరాట దీక్షల పేరట మోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల రికార్డులను ప్లే చేసి మరీ చూపించేస్తున్నారు చంద్రబాబు.

బాబుపై వ్యక్తిగతంగా...

ఈ దశలో ఏపీ బీజేపీ నరేంద్రమోదీని తీసుకురావడం ఒకింత సాహసం చేసిందనే చెప్పాలి. మోదీ రాకతో బీజేపీ క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. నిన్న మొన్నటి దాకా బీజేపీతో కలసి ఉన్న చంద్రబాబు ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటులో బిజీగా ఉన్నారు. మోదీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలనూ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మోదీపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీ చంద్రబాబును టార్గెట్ చేస్తారని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పనున్నారని సమాచారం.

ఏపీకి ఏం చేసిందీ....?

దీంతోపాటుగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవలు, ఏపీకి ఇప్పటి వరకూ ఎన్ని వేల కోట్ల నిధులు ఇచ్చింది? పూర్తి వివరాలను నరేంద్రమోదీ వెల్లడించనున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ కేంద్రం ఏపీకి చేసిన విషయాలను కూడా పూసగుచ్చినట్లు వివరించనున్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను చంద్రబాబు తన పథకాలుగా ఎలా చెప్పుకుంటున్నారో కూడా విశదీకరించనున్నారు. ఇప్పటికే మోదీ రాకను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యేక హోదాపై స్పష్టత ఇచ్చాకే మోదీ ఏపీలోకి అడుగుపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మోదీకూడా చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగే అవకాశముంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సొంత ఇలాకాలో జరుగుతున్న ఈ సభలో మోదీ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Similar News