తేడా ఇక్కడ ఉంది సామీ....!!!

Update: 2018-12-17 09:30 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోతుగా విశ్లేషణ చేశారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి సంక్షేమ పథకాలే కారణమని ఫీడ్ బ్యాక్ లో తేలింది. అందుకే కేసీఆర్ కు వన్ సైడ్ గా ప్రజలు అండగా నిలిచారని చంద్రబాబు తేల్చారు. వివిధ సంక్షేమ పథకాలు తెలంగాణలో నేరుగా ప్రజలకు చేరిన కారణంగానే విజయం సులువగా లభించిందని చంద్రబాబు తన సన్నిహిత మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణలో రెండు, మూడు పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. ముఖ్యంగారైతు బంధు పథకం, కల్యాణ లక్ష్మి పథకాలు ఎక్కువగా ప్రజలను ఆకట్టుకున్నాయని తేలడం విశేషం.

ఏపీలోనూ సంక్షేమ పథకాలు....

అయితే తెలంగాణలో ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వెళ్లాయి. ఏపీలో కూడా వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నారు. రైతు బంధు వంటి పథకం లేకపోయినా నిరుద్యోగ భృతి,రైతు రుణమాఫీ, చంద్రన్న కానుకలు, పింఛన్లు, పెళ్లికానుక వంటివి తమకు వచ్చే ఎన్నికల్లో లబ్ది చేకూరుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి యువతరం ఓటర్లు తమ వైపే ఉంటారన్న ధీమా చంద్రబాబులో వ్యక్తమవుతోంది. తెలంగాణ ధనిక రాష్ట్రం అయి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసింది. అయితే ఏపీ అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఏమాత్రం విస్మరించకుండా ప్రజలకు చేరువ చేయగలిగామని పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు.

లబ్దిదారుల ఎంపికలో.....

కానీ తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ లలో సంక్షేమ పథకాల అమలు, లబ్దిదారుల ఎంపికలో చాలా తేడా ఉందంటున్నారు.తెలంగాణలో లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం పెద్దగా కనపడలేదు. పార్టీల కతీతంగా లబ్దిదారుల ఎంపిక జరిగింది. అక్కడక్కడా ఎమ్మెల్యేల జోక్యం ఉన్నా పార్టీలకతీతంగా అర్హుల ఎంపిక జరిగిందనేది వాస్తవం. కేసీఆర్ అధికారులకే సంక్షేమ పథకాల అమలు బాధ్యతను అప్పగించారు. దీంతో అర్హులైన అందరికీ పథకాలు చేరాయి.అందుకే కేసీఆర్ కు అండగా లక్షలాదికుటుంబాలు నిలిచాయి.

ఏపీలో ఏకపక్షంగా.....

ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది. నిత్యం టెక్నాలజీతో ప్రజల సంతృప్తిని అంచనా వేసుకుని సంబరపడుతున్న చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి అర్థం కావడం లేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. ఏపీలో లబ్దిదారుల ఎంపిక బాధ్యతను జన్మభూమి కమిటీలకే అప్పగించారు. జన్మభూమి కమిటీల్లో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వమే ఉంటుంది. దీంతో గ్రామస్థాయిలో వారుచెప్పిందే వేదం. ఇతర పార్టీలకు చెందిన వారికి ఏ ఒక్క పథకమూచేరకుండా జన్మభూమికమిటీలే అడ్డుకున్నారన్నది విపక్షాలు సయితం ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలనేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పథకాల అమలుతీరును మరోసారి సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు పథకాల గురించి ఏమనుకుంటున్నారన్న దానిపై ఆయన ఆరా తీస్తున్నారట. ఎన్నికలు సమీపిస్తున్న వేళ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారుచంద్రబాబు. మరి బాబు పథకాలు మళ్లీ ఆయనను సీఎం చేస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.

Similar News